రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీ చెప్పుచేతల్లో ఉంటున్నారని, అధికార పార్టీ చెప్పినట్టుగా వింటున్నారని.. తమ పార్టీ వారిని వేధిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఘనంగా దూషించిన సంగతి అందరికీ తెలిసిందే. పోలీసుల మీద ఆయన ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ పోలీసు అధికారులు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పట్టుకొచ్చి వారం సంగతి తేలుస్తామని హెచ్చరించారు. ఏకంగా డీజీపీ ద్వారకా తిరుమల రావు పేరు ప్రస్తావించి మరీ జగన్ హెచ్చరించడం విశేషం. ఆయనను తమ ప్రభుత్వం కాలంలో ఆర్టీసీ ఎండీగా చాలా మంచి పదవిని ఇచ్చినప్పటికీ.. ఆయన ఇప్పుడు వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ జగన్ హెచ్చరికల పట్ల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తీవ్రంగా స్పందిస్తోంది. జగన్ తన హెచ్చరికలను ఉపసంహరించుకోకపోతే.. తీరు మార్చుకోకపోతే తగిన రీతిగా స్పందిస్తాం అని, జగన్ మాటలు ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సంఘం నాయకులు కేఆర్ సూర్యనారాయణ, ఎం రమేశ్ కుమార్ అంటున్నారు. ఈ సందర్భంగా వారు.. జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో.. ఉద్యోగులను వేధించడానికి పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్ చేసిన పాపాలన్నింటినీ బయటకు తీస్తున్నారు.
జీపీఎఫ్ ఖాతాలో ఉండాల్సిన ఉద్యోగుల సొమ్మును దారి మళ్లించారని, జీతాలు పింఛన్ల చెల్లింపును ప్రభువుల దయ- రాజుగారి భిక్ష లాగా మార్చేఝశారని వారు జగన్ ను ఎద్దేవాచేశారు. ఒకటో తేదీ నాటికి జీతాలు పింఛన్లు చెల్లించేలా చట్టం చేయాలని ప్రభుత్వానికి సూచించాల్సిందిగా గవర్నరును కలిసి వినతిపత్రం ఇచ్చినందుకు సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై క్రిమినల్ కేసులు పెట్టించడాన్ని కూడా గుర్తుచేస్తున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరానా తాతా, విశాల్ గున్నీ వంటి పోలీసు అధికారులతో ఉద్యోగ సంఘాల నేతల్ని బెదిరించిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నారు.
సీపీఎస్ రద్దు గురించి హామీని మర్చిపోయారని ప్రశ్నించినందుకు కొన్ని ఉద్యోగ సంఘాల గుర్తింపు రద్దుచేస్తామని బెదిరించిన వైనం కూడా ప్రస్తావిస్తున్నారు. జగన్మహోన్ రెడ్డి తన పరిపాలన కాలంలో సాగించిన అకృత్యాలు అన్నింటినీ మర్చిపోయి.. ప్రజాస్వామ్య హక్కుల గురించి, తప్పుడు కేసుల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని ఉద్యోగ నేతలు జగన్ ను ఎద్దేవా చేస్తున్నారు. పోలీసులను బెదిరిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వారు కోరుతున్నారు. ఏదో అనుకుని పోలీసుల్ని బెదిరించినందుకు, ఇప్పుడు జగన్ పాత పాపాల చిట్టా మొత్తం బయటకు రావడం విశేషం.