జగన్మోహన్ రెడ్డి లో రాజకీయ నాయకుడిగా పరిణతి ఉన్నదా? లేదా? అనుమానం ఇప్పుడు పార్టీ వర్గాల్లో మొదలవుతోంది. ఆయన కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కావడం వలన, ఒక్క చాన్స్ అంటూ బతిమాలడం వలన ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. అత్యంత అసమర్థమైన పాలనతో ఆయన ప్రజల అసహ్యాన్ని మూటగట్టుకున్నారు. ఆ దెబ్బతో కేవలం 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితమై పరాజయం మూటగట్టుకున్నారు. ఒక నాయకుడిగా పరిణతి ఉంటే కనీసం పార్టీని పునర్నిర్మాణం చేసుకోవడంపై శ్రద్ధ పెట్టాలి. లోటుపాట్లను జాగ్రత్తగా దిద్దుకుంటూ ముందుకు సాగాలి. కానీ ఆయన చేస్తున్న పనులు కార్యకర్తలకు, పార్టీలో మిగిలిన నాయకులకు అలాంటి నమ్మకం కలగడం లేదు.
అందరికీ ప్రధానమైన సందేహం ఏంటంటే.. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార ప్రసంగాల నుంచి ఇంకా బయటకు రాలేదు. ఎన్నికల సమయంలో చేతిలో కాగితాలు పెట్టుకుని ప్రతి పదాన్నీ కాగితంలో చూసి చదవడం తప్ప మాట్లాడే అలవాటులేని జగన్మోహన్ రెడ్డికి.. ఇప్పుడు ఆ ప్రసంగాలన్నీ కంఠతా వచ్చేసినట్టుగాకనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో చెప్పవలసిన విషయాలనే ఇంకా చెప్పుకుంటూ గడుపుతున్నారు. ప్రతి ఇంటికీ మంచి చేశాం.. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వం నుంచి సాయం అందింది. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చినది ఒక్క వైసీపీ మాత్రమే. చంద్రబాబునాయుడు పాత మేనిఫెస్టో హామీలను నెరవేర్చలేదు.. లాంటి పడికట్టు మాటలే ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఆయనకు కొత్త ప్రసంగాలు సిద్ధమైనట్టుగా లేదు. లేదా, పార్టీ నాయకులు ఆయనను వదలి వెళ్లిపోతున్నట్టుగా ప్రసంగాలు రాసేవారు కూడా.. ఇక జగన్ తో వేగలేం అనుకుని పారిపోయారేమో తెలియదు. మొత్తానికి చంద్రబాబునాయుడు మోసం చేసి గెలిచారు.. అనే మాటలతోనే ఆయన ఇంకా రాజకీయం చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డికి తనను ప్రజలు ఓడించారనే వాస్తవాన్ని జీర్ణం చేసుకోబుద్ధి కావడం లేదని.. అందుకే ఇంకా చంద్రబాబు మోసంతో గెలిచారు అని చెప్పుకుంటూ తనను తాను మోసం చేసుకుంటున్నారని పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు.
జగన్ అనుకున్న అభివృద్ధి రహిత డబ్బులు పంచిపెట్టే పరిపాలన విధానం అనేది ఫెయిలైంది. ఆయన బుకాయించిన మూడురాజధానులు అనే కాన్సెప్టును ప్రజలు ఛీకొట్టారు. తమకు డబ్బు అందడంతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడమే ముఖ్యం అని ప్రజలు కోరుకుంటున్నారు.. కేవలం అభివృద్ధి కోసమే చంద్రబాబునాయుడుకు ఓటు వేశారు. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి ఎంత త్వరగా తెలుసుకుంటే ఈ పార్టీ అంత బాగుపడుతుందని.. లేకుంటే మరింత పతనం దిశగా వెళుతుందని కార్యకర్తలు ఆక్రోశిస్తున్నారు.