విద్యారంగం చాలా కీలకమైనది. ఏ ప్రభుత్వం గద్దెమీదకు వచ్చినా సరే.. విద్యారంగం మీద గరిష్టంగా దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. శ్రద్ధగా పనిచేస్తున్నారో లేదో తరవాత.. కనీసం అలా కనిపించే ప్రయత్నం చేస్తారు. విద్యారంగం మీద తమ ముద్ర కనిపించడానికి ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని గురించి పదేపదేప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ.. ఇది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో.. ఆయన విద్యారంగాన్ని ఉద్ధరించే పేరిట పెద్దపెద్ద నాటకాలను నడిపిస్తే.. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయిన తర్వాత.. ప్రాక్టికల్ గా విద్యార్థులకు ఏది అవసరమో, ఏది మేలు చేస్తుందో అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు జేఈఈ, నీట్ ఈఏపీసెట్ లపై శిక్షణలు ఇప్పించేందుకు బాబు కేబినెట్ కొత్తగా నిర్ణయం తీసుకుంది. విద్యార్థులందరికీ ఈ పోటీపరీక్షలకు అవసరమైన మెటీరియల్ ను ఉచితంగా సరఫరా చేస్తారు. అలాగే.. పోటీపరీక్షలకు ప్రత్యేకంగా బోధించేందుకు విడిగా సమయం కేటాయిస్తారు.
ప్రభుత్వ కాలేజీల్లో చదివే పేద విద్యార్థులను ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలకు పంపడానికి ఇది ఒక అద్భుతమైన ప్రయత్నం అని అనుకోవాలి. ఆర్థిక వనరులు లేక, కనీసం మెటీరియల్ కూడా కొనుక్కోలేని స్థితిలో విద్యార్థులు ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో వారికి మెటీరియల్ తో పాటు స్పెషల్ కోచింగ్ కూడా ఏర్పాటు చేయడం గొప్ప ప్రాక్టికల్ ప్రయత్నంగా అభినందించాలి.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో విద్యారంగాన్ని ఉద్ధరించే పేరిట అనేక డ్రామాలను నడిపించారు. విద్యార్థులు అమెరికా వెళ్లి చదువుకోవడానికి అవసరమైన ఇంగ్లిషు భాషా నైపుణ్యాల కోసం జీఆర్ఈ, టోఫెల్ కోచింగులను మూడో క్లాసు నుంచి ప్రారంభిస్తున్నామంటూ పెద్ ప్రహసనం నడిపించారు. ఆ ముసుగులో ఆయా సంస్థలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకుని నిధులు కాజేశారు. పేదపిల్లలు అమెరికాకు వెళ్లకూడదా.. అంటూ విమర్శించిన వారిపై నాటకాల డైలాగులు వల్లించారు. కానీ.. వాస్తవంలో జగన్ చేసిన ప్రయత్నాలు.. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగబాకినట్లుగా సాగాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇంటర్ విద్యార్థుల్ని కనీసం ఇంజినీరింగ్, మెడిసిన్ వైపు నడిపించకుండా.. మూడో క్లాసు నుంచి అమెరికా వైపు నడిపించడం అనేది భ్రష్టప్రయోగంగా పేరు తెచ్చుకుంది.
మొత్తానికి జగన్ పాలన పోయింది. విద్యార్థుల జీవితాలను ఆచరణాత్మక దృక్పథంతో గాడిలో పెట్టే ప్రయత్నంలో చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. పైగా గతంలో తెలుగుదేశం సర్కారు ఇంటర్ విద్యార్థులకు పెడుతుండిన మధ్యాహ్న భోజన పథకాన్ని జగన్ రద్దు చేయగా.. ఇప్పుడు చంద్రబాబు కేబినెట్ అదే పథకాన్ని డొక్కా సీతమ్మ పేరుతో పునరుద్ధరించడానికి నిర్ణయం తీసుకోవడం కూడా అభినందించాల్సిన సంగతి.