అప్పటి జగన్ డ్రామా.. ఇప్పుడు రాష్ట్రానికి శాపం!

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఒక వైద్య కళాశాలను ప్రారంభించేస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గతంలో పెద్ద డ్రామా ఆడారు. డ్రామాను రక్తి కట్టించి ప్రజల చేత బలవంతంగా జేజేలు కొట్టించుకున్నారు. వైద్య విద్యారంగంలో రాష్ట్రాన్ని బీభత్సంగా ఉద్ధరించేస్తున్నట్లుగా బిల్డప్పులు ఇచ్చారు. కానీ ఆరోజు ఆయన ఆడిన డ్రామాలు ఇవాళ రాష్ట్రానికి శాపంగా మారాయి. ఆయన ప్రారంభించిన వైద్య కళాశాలల్లో అసలు ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదంటూ మెడికల్ కౌన్సిల్ అనుమతులు కూడా ఇవ్వలేదు. ఆయా కాలేజీల నిర్మాణానికి కనీసం మాత్రపు నిధులు కూడా విడుదల చేయకుండా భవనాలు పూర్తికానివ్వకుండా, తాను ప్రారంభించిన వాటికి తానే గ్రహణం లాగా మారారు జగన్మోహన్ రెడ్డి.

రాష్ట్రంలో ఐదు వైద్య కళాశాలలో ప్రవేశాలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతించలేదు. ఎందుకంటే ఇక్కడ మొదటి సంవత్సరం ఎంబిబిఎస్ ప్రారంభించడానికి తగ్గట్లుగా నిర్మాణాలు జరగలేదు. ఎందుకంటే పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు విడుదల చేయలేదు. ఎందుకంటే.. ఆయా వైద్యకళాశాలల్ని అందుబాటులోకి తీసుకురావడం మీద జగన్ కు శ్రద్ధ లేదు. ..చూడడానికి ఈ వ్యవహారం మొత్తం రాజు గారి కొడుకుల ఏడు చేపల కథ లాగా కనిపిస్తోంది కదా. నిజమే.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఏకంగా 195 కోట్ల రూపాయల విడుదల నిధులు వచ్చే పాడేరు వైద్య కళాశాల నిర్మాణం ఒక మోస్తరుగా జరిగింది. అంతే తప్ప మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోనిలలో పనుల పురోగతి ఘోరంగా ఉంది. ఈ ఐదు కళాశాలలో కూడా మొదటి సంవత్సరం ప్రవేశాలకు అనుమతులు లభించలేదు.
ఐదు మెడికల్ కాలేజీల ప్రకటన వచ్చిన సమయంలో జగన్మోహన్ రెడ్డి చాలా ఆర్భాటంగా సొంత డప్పు కొట్టుకున్నారు. 2024 మార్చి నాటికి తరగతుల ప్రారంభం జరిగేలాగా భవనాలు పూర్తి చేస్తామని అన్నారు. అప్పట్లో ఐదు కళాశాలలో కనీస నిర్మాణాలకు 2425 కోట్ల ఖర్చు అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 22% అంటే 533 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఆ మేరకు పనులు చేశారు కానీ, కాంట్రాక్టర్లకు 200 కోట్ల ఇంకా బకాయిలు ఉన్నాయి.

ఈ స్థాయిలో బకాయిలు ఉండగా పనులు చేయడం తమకు సాధ్యం కాదంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. పనులు జరిగే ప్రాంతం నుంచి తమ తమ యంత్రాలను కూడా తిరిగి వెనక్కి తీసుకువెళ్లి వేరే సైట్లకు తరలిస్తున్నారు. జగన్ ప్రభుత్వం ప్రకటనల  విషయంలో చూపిన ఆర్భాటం ఆచరణలో లేకపోవడం వల్ల వైద్య విద్యను కలగన్న వారికి ఇలాంటి దుస్థితి ఎదురైందని అందరూ అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories