మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనే ఆయన హవాకు చెక్ పెట్టడానికి తెలుగుదేశం పావులు కదుపుతోంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే.. కడప జిల్లా ప్రజలు గత ఎన్నికలకు భిన్నంగా.. జగన్ వ్యతిరేక తీర్పు ఇచ్చిన సంగతి ప్రజలకు గుర్తుండే ఉంటుంది. అలాంటిది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని బలం ఉన్న కడప మునిసిపల్ కార్పొరేషన్ విషయంలో.. ఇప్పుడు రాజకీయాలు మారుతున్నాయి. తక్షణం పార్టీకి వస్తున్న నష్టం ఏమీ లేదు గానీ.. వైసీపీ గుత్త పెత్తనానికి గండిపడబోతోంది.ఏకంగా ఎనిమిది మంది కార్పొరేటర్లు చంద్రబాబునాయుడు సమక్షంలో ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు.
కడప మునిసిపల్ కార్పొరేషన్ లో మొత్తం యాభై స్థానాలున్నాయి. వీటిలో 48 వైసీపీ గెలుచుకుంది. తెలుగుదేశానికి ఒక సభ్యుడుండగా.. ఇండిపెండెంటు కూడా గెలిచిన తర్వాత జగన్ కే మద్దతు ప్రకటించారు. ఆ రకంగా కార్పొరేషన్ పై వైసీపీకి తిరుగులేని పట్టుంది. ప్రస్తుతం 8 మంది కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరుతున్నారు. వీరిలో మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా వరుసకు తమ్ముడు అయ్యే ఒక కీలక నాయకుడు కూడా ఉండడం గమనార్హం. మేయర్ సురేష్ బాబు కు కంచుకోట వంటి ప్రాంతం నుంచి కూడా కార్పొరేటర్లు తెలుగుదేశం లోకి వెళ్లిపోతున్నారు. మేయర్ అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు, అందరినీ కలుపుకుపోయే ధోరణి లేకపోవడం వల్ల మాత్రమే ఇలా కార్పొరేటర్లు పార్టీని వీడుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా, కార్పొరేటర్ల ఫిరాయింపునకు సంబంధించి కొన్ని రోజులుగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా రంగంలోకి దిగి పలువురితో చర్చలు జరిపారు. ఫలితం దక్కలేదు. ఆ తర్వాత ఏకంగా ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆయన పలురకాలుగా కార్పొరేటర్లకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. అయినా సరే వారు పట్టించుకోలేదు.
దీంతో కార్పొరేషన్ లో తెలుగుదేశం బలం 9కి పెరుగుతుంది. తక్షణం మేయర్ పదవికి వచ్చే ముప్పు ఏమీ లేదు. అయితే స్థానికంగా వినిపిస్తున్న పుకార్లను బట్టి.. పదినుంచి పన్నెండు మంది కార్పొరేటర్లు కూడా ఇంకా పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా పూర్తి ఏకపక్షంగా కడప కార్పరేషన్ పై వైసీపీ పెత్తనం సాగుతూ వచ్చింది. అయితే ఈ మార్పుల వలన.. పరిస్థితులు మారుతాయని.. వైసీపీ విచ్చలవిడితనానికి బ్రేకు పడుతుందని అంతా అనుకుంటన్నారు. తెలుగుదేశం మాత్రం.. పూర్తిగా మేయర్ పదవి కూడా తమ పార్టీకి దక్కేలా ఇతరుల్ని కూడా చేర్చుకోవడానికి చూస్తున్నట్టుగా తెలుస్తోంది.