జగన్ భక్త అధికార్లపై గులాబీనేత విసుర్లు!

పృష్టతాడనాత్ దన్త భంగః అన్నట్టుగా ఎక్కడో ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ప్రస్తుతం నానా కష్టాలు పడుతున్న జగన్ భక్త అధికారుల గురించి, మరెక్కడో తెలంగాణలో ఉన్న గులాబీ పార్టీ నాయకుడు మాట్లాడవలసిన అవసరం ఏం వచ్చిందా అనుకుంటున్నారు కదా? నిజమే కానీ, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నదంటే.. దేశంలో ఎక్కడ అధికారులైనా రాజకీయ ప్రాపకం కోసం అదుపుతప్పి రెచ్చిపోయి వ్యవహరిస్తే.. జగన్ భక్త అధికారులను చూపించి వారిని బెదిరించే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలోని గులాబీనేత హరీష్ రావు కూడా అదే పనిచేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని, అధికారులు రెచ్చిపోరాదని హరీశ్ వారికి హితవు చెబుతున్నారు. వారికి సుద్దులు చెప్పడం మాత్రమే కాదు. ఏపీ ఉదాహరణల్ని కూడా వివరించారు. ఏపీలో అధికారులు గత ప్రభుత్వంలో రెచ్చిపోయారు.. ప్రస్తుతం సస్పెండ్ అవుతున్నారు. అధికారంలో ఉన్నామని రెచ్చిపోతే అక్కడి అధికారులకు పట్టిన గతే మీకూ పడుతుంది.. అని హరీష్ హెచ్చరించారు.

నిజానికి గులాబీ దళాలతో జగన్మోహన్ రెడ్డి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుంటారు. గులాబీ నాయకులు జగన్ ను పల్లెత్తు మాట అనరు. ఆయనను నొప్పించేలాగా ఏమీ మాట్లాడారు. అయితే ఈ ఏర్పాటు తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ ల వరకు మాత్రమే పరిమితం. హరీష్ రావు ఎన్నడూ కూడా జగన్ ప్రాపకాన్ని ఆశించిన వ్యక్తి కాదు. జగన్ మీద ఎప్పటికప్పుడు ఆయన సెటైర్లు వేస్తూనే వచ్చారు. గతంలో ఏపీలో పరిపాలన గురించి, అధ్వానంగా ఉన్న రోడ్ల గురించి కూడా హరీష్ రావు పలుమార్లు మాట్లాడారు.

హరీష్ రావు చెప్పింది నిజమే. జగన్ జమానాలో.. ఆయన తన సొంత మనుషులు, తైనాతీలు, తొత్తులు అయిన అధికారులందరినీ తెచ్చి కీలక పదవుల్లో పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా వారు కూడా కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తించారు. వారి దెబ్బకు ఏకంగా ప్రభుత్వమే భ్రష్టుపట్టిపోయింది. పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఓటమి తర్వాత ఆ అధికారులందరూ కూడా శంకరగిరి మాన్యాలు పట్టిపోయారు. ఆ వ్యవహారాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయనాయకులకు ఊడిగం చేసే అధికార్లను హెచ్చరించడానికి ఉదాహరణలుగా ఉపయోగపడుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories