ఆ అధికారులు.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో చాలా చాలా కీలక పదవుల్లోనే ఉన్నారు. నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన స్థానాల్లో ఉన్నారు. కానీ వారు తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం.. ప్రభుత్వానికి నష్టం తెచ్చేవి, పరువునష్టం కలిగించేవి. వారి వ్యవహార సరళి మాత్రం జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడడానికే అన్నట్టుగా సాగిపోతోంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 8 నెలలు గడచిపోతున్నప్పటికీ.. కూటమి నాయకులకు చేదుగుళికల్లాగా మింగుడుపడని, జగన్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్న అధికార గణాలు ప్రభుత్వంలో కొల్లలుగా ఉన్నారు. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి, తమ సంస్థ ఎండీతో సహా పలువురు ఉన్నతాధికారుల మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ జగన్ భక్త కోవర్టు అధికారుల కార్యకలాపాలు మరోసారి తెరమీదకు వచ్చాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కోవర్టు అధికారులు.. జగన్ దళాలకే ఎక్కువ మేలు చేసేస్తుండడం అనేది బయటపడడం ఇది తొలిసారి కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా.. జగన్‌తో అప్పట్లో కుమ్మక్కు అయి పనులు చేసిన కాంట్రాక్టర్లకు వందల కోట్ల రూపాయల బిల్లులు మంజూరయ్యాయంటూ ఒక విమర్శ వచ్చింది. విద్యుత్తు శాఖలో ఇప్పటికీ కూడా జగన్ బినామీలుగా చెప్పుకునే కాంట్రాక్టర్ల మాటే చెల్లుబాటు అవుతోందనే వార్తలు కూడా వచ్చాయి. విశాఖలో రుషికొండ భవనాలు కట్టిన కాంట్రాక్టరుకు బిల్లులు ఆపమని చెప్పినా కూడా.. ఇటీవల బిల్లులు చెల్లించేసిన అధికారుల తీరుపై సాక్షాత్తూ ఆర్థిక శాఖ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తాము చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీరెడ్డి వంతు వచ్చింది.
తమ సంస్థలో 400మందికి పైగా అక్రమ నియామకాలతో కోట్లాది రూపాయల జీతాలు తీసుకుంటున్నారంటూ జీవీరెడ్డి ఇటీవల ఆరోపించారు. వీరంతా గత జగన్ ప్రభుత్వ హయాంలో నోటిమాట సిఫారసులతో నియామకాలు పొందారని, ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో, ఏం పనిచేస్తున్నారో కూడా తెలియకుండానే జీతాల చెల్లింపు జరుగుతున్నదని వారందరినీ తొలగించబోతున్నట్టుగా ఆయన చెప్పారు. అయితే.. ఈ ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి తయారైన ఉత్తర్వుల మీద ఫైబర్ నెట్ ఎండీ, ఈడీ సంతకాలు చేయనేలేదట. కేవలం వారు సంతకాలు చేయకపోవడం వల్ల ఆ ఉద్యోగులకు ఇప్పుడు కూడా జీతాలు చెల్లించాల్సి వచ్చింది. ఫైబర్ నెట్ ను గాడిలో పెట్టడానికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పప్పూ భరద్వాజ, బిజినెస్ అండ్ ఆపరేషన్స్ హెడ్ గంధంశెట్టి సురేశ్, ప్రొక్యూర్ మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్ లను తక్షణం తొలగిస్తున్నట్టుగా జీవీరెడ్డి ప్రకటించారు. ఒక్క ఆపరేటర్ ను కూడా కలవకుండా, ఒక్క కొత్త కనెక్షన్ తీసుకురాలేకుండా, ఒక్క రూపాయైనా ఆదాయం పెంచకుండా ఫైబర్ నెట్ ను చంపేయాలని ఎండీ దినేశ్ కుమార్ భావిస్తున్నారా? అని జీవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. చూడబోతే.. ఇలాంటి దినేశ్ రెడ్డిలు.. ఇంకా అనేక శాఖల కీలక పదవుల్లో ఉంటూ.. కూటమి ప్రభుత్వానికి గోతులు తవ్వుతున్నట్టుగా కనిపిస్తోంది.