జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిన కాలంలో వైసిపి కార్యకర్తలు, నాయకులు రెచ్చిపోయిన తరహాలోనే.. జగన్ భక్త జర్నలిస్టులు కూడా అనేక హోదాలలో చెలరేగిన సంగతి ప్రజలకు తెలుసు. అలాంటివారు ఇప్పుడు సామాజిక కార్యకర్తల అవతారం ఎత్తుతున్నారు. సోషల్ మీడియా సైకోలను పోలీసులు అరెస్టు చేస్తుంటే.. అసలు ఈ తరహా అరెస్టుల పర్వం చేయడమే పెద్ద తప్పు అంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి భంగపడుతున్నారు. హైకోర్టు కూడా ‘పోలీసులు తమ పని తాము చేస్తుంటే మేము ఎలా అడ్డుపడగలం’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించడం గమనార్హం .
గతంలో ఒక పత్రికకు సంపాదకుడుగా కూడా పనిచేసిన విజయబాబు జగన్మోహన్ రెడ్డి హయాంలో వివిధ పదవులు అనుభవించారు. అప్పట్లో ఆయన వ్యవహార సరళిపై కొన్ని వివాదాలు కూడా చెలరేగాయి. అలాంటి విజయబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేయడంపై హైకోర్టులో పిల్ వేశారు. ఈ విచారణ సందర్భంగా న్యాయమూర్తులను కూడా వదలకుండా అత్యంత అసహ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పేముంది అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. పోలీసుల చర్యలను నిలిపివేయాలంటూ ఉత్తర్వులు ఇవ్వలేం- అని హైకోర్టు స్పష్టం చేసింది. ఎవరి మీదనైనా కేసులు పెట్టడంలో తప్పు జరిగినట్టుగా వారు భావిస్తే గనుక సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చునని సూచించింది.
ఒకవైపు కేసులు అరెస్టుల పర్వం కొనసాగుతుండగా సోషల్ మీడియా పాపాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. మామూలు కార్యకర్తలతో దుర్మార్గాు చేయించిన పెద్ద తలకాయలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కార్యకర్తల సోషల్ మీడియా హ్యాండిల్స్ ను స్వయంగా తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ఆపరేట్ చేస్తూ చెలరేగిన సంగతి బయటకు వస్తోంది. అయితే జగన్ భక్త దళాలలో మాత్రం ఆవేదన పెల్లుబుకుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇలాంటి అసంబద్ధ విషయాలపై జగన్ భక్త మాజీ జర్నలిస్టులు పిల్ లు వేసి భంగపడే బదులుగా.. ప్రభుత్వ నిర్ణయాల్లో ఏవైనా లోపాలు జరుగుతూంటే.. వాటి గురించి కేసులు వేస్తే ప్రజకు మేలు జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.