జగన్మోహన్ రెడ్డి తనకు బాగా అలవాటు అయిపోయిన డొంకతిరుగుడు వాదనలు వినిపించడాన్నే నమ్ముకున్నారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి నాయకుడిగా.. శాసనసభలో అడుగుపెట్టడం అవమానంగా భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి.. సిగ్గుపోతుందనే భయంతో సభకు వెళ్లడం లేదు. తాను వెళ్లకపోవడానికి కారణం తెలుగుదేశం అరాచకత్వమే అన్నట్టుగా ఇప్పుడు బిల్డప్ ఇస్తున్నారు. అసెంబ్లీలో తమ పార్టీ వారికి మైక్ ఇచ్చే పరిస్థితి లేదని.. మైక్ ఇస్తే ప్రభుత్వం తీరును ఎండగడతాం అని వారికి భయం అని.. మైక్ కూడా ఇవ్వనప్పుడు అసలు సభకు ఎందుకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు ప్రభుత్వ పరిపాలన కాలంలో కూడా శాసనసభకు వెళ్లకుండా డుమ్మా కొట్టారు. ప్రతిపక్షంలో కూర్చోవడం అంటేనే ఆయనకు అవమానం. ప్రజలు తనను ఎమ్మెల్యేగా తమ తరఫున సభలో గళం వినిపించడానికి గెలిపిస్తే.. ఆ పని చేయడం ఆయనకు అవమానం. ప్రజలు అప్పగించిన పని చేసే ఉద్దేశం లేనప్పుడు.. అసలు ఎన్నికల్లో పోటీచేయకుండానే ఉంటే సరిపోతుంది కదా అనేది ప్రజల అభిప్రాయంగా ఉంటోంది.
శాసనసభలో తమ పార్టీ వారికి మైక్ ఇవ్వరు అని జగన్మోహన్ రెడ్డి ముందే హైపోతికేటెడ్ అభిప్రాయాలతో మాట్లాడుతుండడమే తమాషా. సభలో ప్రతి పార్టీకి చెందిన సభ్యులకు మాట్లాడే అవకాశం స్పీకరు ఇస్తారు. ఆయా పార్టీలకు సభలో ఎంత బలం ఉన్నదో ఆ దామాషాను బట్టి పార్టీలకు, సభ్యులకు మాట్లాడే అవకాశం దొరుకుతుంది. ఇది చట్టం నిర్దేశించిన పద్ధతి. తాను జగన్మోహన్ రెడ్డిని గనుక.. తన పార్టీ గెలిచిన ఎమ్మెల్యే సీట్లతో సమానం లేకుండా.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చినంత టైం తనకు కూడా ఇవ్వాలని జగన్ ఆశపడితే కుదరదు. ఓడిపోయినా సరే.. తనను తాను సీఎంతో సమానంగా ఊహించుకునే వ్యక్తి జగన్. అందుకే సీఎంతో సమానంగా తనకు సెక్యూరిటీ ఏర్పాట్లు ఉండాలని ఏకంగా హైకోర్టులో కేసు వేసి నిరీక్షిస్తున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మైకు ఇవ్వరు అనే సాకు చూపించి సభకు ఎగ్గొట్టాలని అనుకోవడం వింతేమీ కాదు.
కొన్ని రోజుల కిందట స్పీకరు అయ్యన్నపాత్రుడు చాలా స్పష్టంగా చెప్పారు. నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే భయంతోనే జగన్ శాసనసభకు రావడం లేదు.. అని అన్నారు. జగన్ అహంకారం అందుకు అడ్డు వస్తుందని చెప్పారు. ఒకసారి సభకు రారాదా జగన్.. సరదాగా ముచ్చట్లు చెప్పుకుందాం అంటూ ఎద్దేవా చేశారు. చూడబోతే.. జగన్ లోని ఆ భయమే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. సభకు వెళ్లకుండా డుమ్మా కొట్టేసి.. ఇలాంటి డొంకతిరుగుడు కారణాలు చెబుతున్నట్టుగా కనిపిస్తోంది.