ఇలాంటి రచ్చ చేయాలనే జగన్ కోరిక!

ఏదైనా సరే సింపుల్ గా చేయకూడదు. సింపుల్ గా ఉండదగిన విషయాన్ని కూడా కోతి పుండు బ్రహ్మ రాక్షసి అన్నట్టుగా పెద్దదిగా మార్చేయాలి. చిన్న సమస్యను బ్రహ్మాండమంత పెద్దదిగా ప్రొజెక్టు చేయాలి. రచ్చ రచ్చ అయిపోవాలి.. జనం అందరి దృష్టి దాని మీదనే ఉండాలి.. ఇదే బహుశా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరిక లాగుంది. అందుకే ఆయన మిర్చి రైతులను పరామర్శించడం అనే ఒక చిన్న కార్యక్రమాన్ని కూడా చాలా పెద్దదిగా.. పోలీసు కేసులు నమోదు అయ్యేంత నేరంగా మార్చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం మిర్చికి మార్కెట్ ధరలు లేవు. ఈ పరిస్థితి కేవలం ఏపీలో మాత్రమే కాదు. దేశమంతటా అలాగే ఉంది. ఎగుమతులు లేకపోవడం వల్ల దేశంలో ఎక్కడా మిర్చికి ధర పలకడం లేదు. మార్కెట్ కొనుగోలు ధరలు పడిపోయాయి. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇంతవరకు ఓకే.. అయితే.. మిర్చి రైతుల కన్నీళ్లను తన రాజకీయంగా సోపానాలుగా వాడుకోదలచిన జగన్మోహన్ రెడ్డి.. వారి పరామర్శకు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లాని సంకల్పించారు.  అయితే గుంటూరు,కృష్ణా జిల్లాల్లో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కోడ్ ముగిసే దాకా కార్యక్రమాలు కరెక్టు కాదని పోలీసులు సమాచారం ఇచ్చారు. జగన్ తన కార్యక్రమాల్ని కూడా వాయిదా వేసుకున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఆయన మనసు మార్చుకున్నారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ.. దానిని ఉల్లంఘిస్తే తప్ప.. తద్వారా తన మీద కొత్త కేసులు నమోదు అయితే తప్ప మజా ఉండదని ఆయన అనుకున్నారో ఏమో తెలియదు. గుంటూరు మిర్చి రైతులను పరామర్శించడానికి మార్కెట్ యార్డుకు వెళ్లారు.

జగన్ వెంట ప్రజల్లోకి వెళ్లడానికి.. ఎన్నికల్లో ఓడిపోయిన నాటినుంచి ఇవాళ్టి వరకు బాహ్యప్రపంచంలో కనిపించకుండా కలుగుల్లో దాక్కున్న వైసీపీ నాయకులు అందరూ కూడా తరలి వచ్చారు. ‘జగన్ సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేయించడానికి వేలమంది జనాన్ని కూడా తరలించారు. అంతా కలిపి జగన్ ఒక ప్రదర్శన , బహిరంగ సభ నిర్వహించినట్లుగా అయింది.

ఇప్పుడు కోడ్ ఉల్లంఘించి మిర్చియార్డులో కార్యక్రమం నిర్వహించినందుకు జగన్ తో సహా ఎనిమిది మంది వైసీపీ నాయకుల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. జగన్ తో పాటు ఆ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నెల్లి తదితరులమీద కేసు నమోదు అయింది. పైగా జగన్ వెంట వచ్చిన వారంతా మిర్చి యార్డు వద్ద రోడ్లమీదనే ఎక్కడ పడితే అక్కడ తమ వాహనాలను పార్క్ చేసేయడంతో.. యార్డుకు మిర్చి తరలించేరైతులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గోటితో పోయే దానికి గొడ్డలి వాడడమే తన తీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పరామర్శలను కేసులదాకా తెచ్చుకోవడం కేవలం జనం సానుభూతి వస్తుందనే అత్యాశతో మాత్రమేనని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories