జగన్ కు ఉన్న కీర్తి కాంక్ష చంద్రబాబులో సున్నా !

నాయకులు తమ పనిని తాము చిత్తశుద్ధితో, లోపరహితంగా చేసుకుంటూ పోతే చాలు. ప్రజా ప్రయోజనం మాత్రమే లక్ష్యంగా ఇతరత్రా సంకుచిత ఆలోచనలు లేకుండా పనిచేసుకుంటూ పోతే ఆ నాయకులకు కీర్తి అనేది ఆటోమేటిక్గా దక్కుతుంది! అంతేతప్ప తమ కీర్తి దక్కాలనే కాంక్షతో అడ్డదారులు తొక్కడం మంచి పద్ధతి కాదు! అయినదానికి లేనిదానికి ప్రభుత్వం సొమ్ముతో నిర్వహించే పథకాలకు సొంత పేర్లు పెట్టుకుని ఊరేగడం కూడా మంచి పద్ధతి కాదు! చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే విషయాన్ని నిరూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి జమానాలో ఆయన తన సొంత పేర్లు తగిలించుకున్న పాత పథకాలకు తిరిగి పాత పేర్లే కొనసాగించేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రాష్ట్రంలో మొత్తం ఆరు పథకాలకు పేర్లను మార్చేశారు. వీటిలో నాలుగు జగనన్న పేరు మీద, రెండు వైఎస్ఆర్ పేరు మీద చలామణి అవుతున్న పథకాలే కావడం గమనార్హం! పాత పేర్లు పునరుద్ధరించగా ఒక్కదానికి మాత్రం చంద్రబాబు పేరు మరొక్కదానికి మాత్రం ఎన్టీ రామారావు పేరు వచ్చాయి.

జగన్ మోహన్ రెడ్డి లో ఉన్నంతగా కీర్తి కండూతి తనకు లేదని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా నిరూపించుకున్నారు. విద్యాకానుక, విదేశీ విద్యకు సహకారం, పెళ్ళికానుక ఇలా అన్ని పథకాలకు జగన్.. తన పేరు, తండ్రి పేరు తగిలించుకున్నారు. కొత్తగా వచ్చిన పేర్లలో పెళ్లి కానుకకు మాత్రం ‘చంద్రన్న పెళ్లి కానుక’గా చలామణిలోకి వచ్చింది. అది 2019 కి పూర్వం ఉన్న ప్రేరే కావడం గమనార్హం. అలాగే విద్యాదీవెన, వసతి దీవెన వంటివాటికి నాయకుల పేర్లు తగిలించకుండా చంద్రబాబు తన పరిణతి చూపించుకున్నారు. అలాగే ఎస్సీ విద్యార్థుల కోసం అమలు చేసే విదేశీ విద్యకు సహకరించే పథకానికి అంబేద్కర్ పేరు పెట్టి దళిత వర్గాలలో మంచి పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు.

ఒకవేళ ఐదేళ్ల తర్వాత మళ్లీ అధికార బదలాయింపు లాంటిది జరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాకూడా ఇప్పుడున్న పేర్లను మార్చడానికి వీలు లేని విధంగా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం విశేషం! తెలుగుదేశం ముద్ర కనిపించని పథకాలే వీటిలో నాలుగు ఉన్నాయి. వాటిని జగన్ మళ్ళీ గెలిచినా కూడా మార్చలేరు. నిష్పాక్షికంగా నిస్వార్ధంగా ప్రభుత్వం అందించే సేవగానే అవి ప్రజలకు చేరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు.

ప్రభుత్వ పథకాలకు తమ పేర్లు తగిలించుకోవడం వల్ల నాయకుల పట్ల ప్రజల్లో ప్రేమ ఉప్పొంగిపోయేది ఉండదని.. జగన్ పాలన నిరూపించింది. ఆయన ప్రతిరూపాయి పథకానికీ తన పేరు తగిలించుకున్నప్పటికీ.. జనం దారుణంగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. చంద్రబాబునాయుడు అలాంటి అనుచిత కీర్తి కండూతితో ఆరాటపడకుండా వ్యవహరించడం బాగుంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories