జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అదానీ నుంచి 1750 కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నట్టుగా ఎఫ్బీఐ నివేదిక తేల్చిన తర్వాత.. చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో.. జగన్ తరఫున ఆయన అనుచరులు మీడియా ముందుకు వచ్చి.. మా నాయకుడు లంచాలు తీసుకోలేదు అని ఊదరగొట్టడం తప్ప.. జగన్ స్వయంగా ప్రజలకు సందేహాలు నివృత్తి చేయలేదు. ఎట్టకేలకు ఆ పనిచేశారు. ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అయితే అందులో.. పూర్తిగా పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత.. కనీసం ఓ గంట సేపు తన పరిపాలనలో ఎన్ని అద్భుతాలు జరిగాయో చెప్పుకోవడానికి సమయం కేటాయించారు. ఎన్నికల ప్రచారం సమయంలో కంఠస్థం పట్టిన ప్రసంగాన్నే మళ్లీ వినిపించారు. ఆ తర్వాత చాలా నిదానంగా అదానీ ముడుపుల వ్యవహారంలోకి వచ్చారు. నిజం చెప్పాలంటే ఆయన చెప్పిన కొత్త విషయం అంటూ ఏమీ లేదు. గత కొన్ని రోజులుగా ఆయన అనుచరులు ఎలాంటి బుకాయింపు మాటలు చెబుతున్నారో.. ఆయన వాటినే రిపీట్ చేశారు. కాకపోతే, కాస్త నాటకీయ ప్రసంగ ధోరణిలో రక్తికట్టించేలా చెప్పడానికి ప్రయత్నించారు.
ప్రధానమైన అబద్ధం ఏంటంటే.. చంద్రబాబునాయుడు 6.99 రూపాయలకు కొన్న కరెంటును తాను 2.49కి కొంటే అది గొప్పే కదా? సంపదను సృష్టించినట్టే కదా? చంద్రబాబు రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేస్తే.. తాను చాలా పెద్ద లాభం చేసినట్టు కదా అని జగన్మోహన్ రెడ్డి బుకాయిస్తున్నారు. కానీ.. మతలబు అక్కడే ఉంది. సోలార్ పవర్ అనేది మొదలైన తొలిరోజుల్లో వాటి ఖరీదు చాలా ఎక్కువగా ఉండేది. కాలక్రమంలో వాటి ఉపకరణాలు ధరలన్నీ దిగివచ్చాయి. యూనిట్ కరెంటు ధర కూడా తగ్గింది. 6.99 నుంచి 2.49 వరకు సహజంగా తగ్గడమే తప్ప, అందులో జగన్మోహన్ రెడ్డి ఉద్ధరించినది ఏమీ లేదు. నిజానికి 2.49రూపాయలకు ఒకటిరెండేళ్లు పాటు 500 మెగావాట్లో, వెయ్యి మెగావాట్లో ఒప్పందం కుదుర్చుకుని ఉంటే కూడా ఆయనకు ఈ స్థాయి లంచం ముట్టేది కాదు. కానీ.. 25 ఏళ్లపాటూ ఏడువేల మెగావాట్ల విద్యుత్తు సరఫరాకు ఒప్పందం చేసుకోవడమే అసలు కిటుకు! రానురాను సోలార్ విద్యుదుత్పత్తి వ్యయం ఇంకా తగ్గుతుంది. నాలుగైదేళ్లు గడిచేసరికి యూనిట్ ధర రూపాయికి పడిపోయినా ఆశ్చర్యం లేదు. అంటే 25వ సంవత్సరం వరకు కూడా 2.49 వంతున ఏపీ చెల్లించాల్సి రావడంలోనే అసలు రాష్ట్ర ఖజానాకు చేస్తున్న ద్రోహం దాగి ఉంది. ఆ వాస్తవాన్ని మరుగున పెడుతూ ప్రజలను మభ్యపెడుతూ.. తాను తక్కువ ధరకు డీల్ చేసుకున్నాను గనుక.. తాను రాష్ట్రాన్ని ఉద్ధరించేసినట్టే అని అబద్ధాలు చెప్పడానికే జగన్ ప్రెస్ మీట్ పెట్టారని పలువురు విమర్శిస్తున్నారు.