మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఏ కొంత అయినా విశ్వసనీయత అనేది ఉంటే.. అది ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లోనే మంటగలిసిపోయింది. కనుకనే జగన్మోహన్ రెడ్డి కి 151 సీట్లను కట్టబెట్టిన ప్రజలే కేవలం 11 సీట్లకు పరిమితం చేసి అత్యంత అవమానకరమైన స్థితిలో కూర్చోబెట్టారు. ఆ 11 సీట్లు దక్కగలిగినంతటి క్రెడిబిలిటీ మాత్రమే ఆయనకు ప్రజల్లో మిగిలింది.
తాజాగా చెల్లెలితో ఆస్తుల తగాదాలు.. తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసి ఆ షేర్లను తిరిగి తానే తీసుకోవాలనుకోవడం ఇలాంటి వ్యవహారాల వల్ల ఆయన మిగిలిఉన్న క్రెడిబిలిటీ మీద నీలిమేఘాలు కమ్ముకున్నాయి. తాజాగా వారి తల్లి వైఎస్ విజయమ్మ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేసిన తర్వాత.. జగన్ కు ఉన్న ఆ అతికొద్ది పాటి క్రెడిబిలిటీ కూడా పూర్తిగా పాతాళానికి పడిపోయింది.
అన్నా చెల్లెళ్ల వివాదంలో జగన్మోహన్ రెడ్డి దోషం ఎంత మేరకు ఉన్నదో విజయమ్మ తేల్చి చెప్పారు. ‘ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం. తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా విధి, నా ధర్మం.’ అని విజయమ్మ చెప్పిన మాటలను బట్టి.. జగన్ బుద్ధి ఎలాంటిదో ప్రజలకు అర్థమైపోయింది. ఒకవైపు షర్మిల తొలినుంచి అన్నయ్య దుర్మార్గాలను బయటపెడుతూనే ఉన్నప్పటికీ.. ప్రజల్లో కొన్ని సందేహాలుండేవి. షర్మిల కావాలనే ఆరోపణలు చేస్తున్నదని అనుకుంటున్న వారు కూడా ఉన్నారు.
అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి.. తన వాదనలకు బలం చేకూర్చడానికి బాబాయి వైవీ సుబ్బారెడ్డిని, ఆడిటర్ విజయసాయిరెడ్డిని రంగంలోకి దించడం కూడా ప్రజల్లో కొంచెం సందిగ్ధత ఏర్పడడానికి కారణం. ఎందుకంటే.. జగన్ – షర్మిల ఇద్దరూ తగాదా పడుతున్న పార్టీలు కాబట్టి ఎవరికి అనుకూలమైన వాదనే వారు చెప్పుకుంటారు. అలా కాకుండా వైవీసుబ్బారెడ్డి ఇద్దరికీ సమానమైన దగ్గరితనం ఉన్న బంధువు గనుక.. ఆయన మాటలకు విలువ వచ్చింది. వైసీపీలో ఇతర నాయకులు ఎన్ని విమర్శించినా తేలిగ్గా స్పందించిన షర్మిల కూడా వైవీ మాటలకు ఎమోషనల్ అయ్యారు.
కానీ.. ఇప్పుడు విజయమ్మ బహిరంగ లేఖ ద్వారా అసలు విషయం తేటతెల్లం అయినట్టే. కుటుంబ ఆస్తులు మొత్తం తానే కొట్టేయడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుట్ర చేస్తున్నట్టే కనిపిస్తోంది.ఈడీ ఎటాచ్మెంట్ లో లేని ఆస్తులను ఇవ్వడంలో కూడా జగన్ అన్యాయం చేసినట్టుగా విజయమ్మ వివరిస్తున్నారు. వైసీపీ అభిమానుల్లో జగన్ పట్ల ఏ కొంచెమైనా నమ్మకం ఉండి ఉంటే.. ఈ విజయమ్మ లేఖతో అది కూడా సాంతం నాశనమైపోయినట్టే అని పలువురు భావిస్తున్నారు.