మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ముందుకు సాగకుండా, అభివృద్ధి పనులు నడవకుండా అడ్డుపడడానికి తన శక్తివంచన లేకుండా రోజురోజుకూ ఒక కొత్త కుట్రలు చేస్తూనే ఉన్నారనే సంగతి అందరికీ తెలుసు. అందరూ గమనిస్తున్న సంగతే. అయితే తన బినామీగా తన అండదండలతో ఎదిగిన కంపెనీని అడ్డు పెట్టుకుని.. ఆయనన ఒక కుట్రను అమలు చేయాలని చూశారు. నిజానికి కూటమి ప్రభుత్వం చేసిన మార్పు పట్ల ఆ కంపెనీ యజమానులు సుముఖంగానే ఉన్నప్పటికీ.. వారిని అడ్డు పెట్టుకుని తన పాచిక పారేలా చూసుకోవాలనుకున్నారు జగన్. ప్రజల్లో లేని భయాన్ని తన అనుచరదళాలతో పుట్టించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించినట్టుగా ఒక దుర్మార్గమైన ప్రచారాల్ని నడిపించారు. అయితే జగన్ కుట్రలన్నీ తేలిపోయాయి. కందుకూరు వద్ద ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వడానికి రైతులు అంగీకరిస్తున్నారు. ఎకరాకు కంపెనీ ఇవ్వదలచుకున్న పరిహారం బాగా పెరగడంతో రైతులు ముందుకు వస్తున్నారు. ఈ రకంగా జగన్ కుట్రలన్నీ తుస్సుమంటున్నాయి.
రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా జగన్ ప్రభుత్వం ఉన్న కాలంలో ఇండోసోల్ కంపెనీకి భూములు ఇచ్చారు. అయితే జగన్ పాలన కాలం ముగిసేవరకు కూడా వారు కార్యకలాపాలు మాత్రం ప్రారంభించలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ప్రాంతంలో మరింత పెద్ద ప్రాజెక్టుగా బీపీసీఎల్ తమ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. బీపీసీఎల్ రాష్ట్రానికి వచ్చినట్టయితే పారిశ్రామికంగా, ఉపాధుల, ఉద్యోగాల పరంగా ఆ ప్రాంత ముఖచిత్రమే మారిపోతుందనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు బీపీసీఎల్ కు భూములు కేటాయించడానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ మేరకు ఇండోసోల్ కు ప్రత్యామ్నాయంగా కరేడు వద్ద 8 వేల ఎకరాలకు పైగా భూములు కేటాయించడానికి ఒప్పుకున్నారు. ఇందుకు ఆ సంస్థ కూడా అంగీకరించింది. అయితే జగన్ దళాలు రంగప్రవేశం చేశాయి. బీపీసీఎల్ కంపెనీ రావడం వల్ల ఆ ప్రాంతం బాగుపడితే చూడలేం అనే కుట్రతో వారు కరేడు రైతులను భూములు ఇవ్వకుండా రెచ్చగొట్టారు. ఇండోసోల్ కు వ్యతిరేకంగా కరేడులో ఉద్యమాలు చేయించారు.
జగన్ స్వయంగా కరేడు రైతులు కొంతమందిని తన వద్దకు పిలిపించుకుని తాను వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చి పంపారు. ఆ సమయంలోనే జగన్ కుట్రలు ఫలించడం లేదని అర్థమైంది. ఎందుకంటే.. జగన్ పిలిపిస్తే కరేడు నుంచి వచ్చింది కేవలం 12 మంది రైతులు మాత్రమే. తీరా కలెక్టరు స్థానిక రైతులకు అవగాహన కల్పించేందుకు సుదీర్ఘ ప్రయత్నాలు చేసిన తర్వాత.. రైతులు పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. తొలుత ఎకరాకు 12.5 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదరగా.. రైతులు పెంచమని అడగడంతో ఒక ఎకరాకు 20 లక్షలు ఇవ్వడానికి ఇండోసోల్ అంగీకరించింది. దీంతో రైతుల్లోసుముఖత వ్యక్తమైంది. వందమంది రైతులకు పైగా ఆల్రెడీ ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు కూడా. ఇంకా 1500 మంది రైతుల దాకా సంతకాలకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కరేడులో ఇండోసోల్ కు తద్వారా బీపీసీఎల్ రావడానికి ఆటంకాలు తొలగిపోయినట్టే. కరేడు సాకుగా పెట్టుకుని జగన్ చేయదలచుకున్న కుట్రలన్నీ విఫలమైనట్టే అని ప్రజలు అనుకుంటున్నారు.