నవ్వులపాలయ్యేలా జగన్ తమ్ముడి ప్రసంగం!

బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు, తెరవెనుక ప్రధాన సూత్రధారిగా ప్రచారంలో ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన ఆత్మీయుడైన తమ్ముడిగా చెప్పుకుంటూ ఉంటారు. ఆయనను చాలా కష్టపడి మళ్లీ గెలిపించారు. అలాంటి ఎంపీ అవినాష్ రెడ్డి తాజాగా లోక్ సభలో చేసిన ప్రసంగం, వినిపించిన డిమాండ్లు ఆయనను మాత్రమే కాదు కదా.. యావత్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన రెడ్డి కుయుక్తులను కూడా నవ్వులపాలు చేసే విధంగా ఉంది.

లోక్ సభలో ఫైనాన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన అవినాష్ రెడ్డి.. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండు చేయడం విశేషం. ప్రత్యేకహోదా కోసం ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి పలుమార్లు కేంద్రానికి వినతిపత్రాలు కూడా ఇచ్చారని అవినాష్ గుర్తుచేశారు.

అయిదేళ్లపాటు అధికారంలో ఉన్న జగన్.. ప్రత్యేకహోదా అనే ప్రజల ఆశను సమూలంగా తొక్కి చంపేశారనే అపకీర్తిని మూటగట్టుకున్నారు. చంద్రబాబు పరిపాలన సాగుతున్నప్పుడు.. తనపార్టీకి చెందిన లోక్ సభ ఎంపీలతో మాత్రం ప్రత్యేకహోదా డిమాండ్ తో రాజీనామాలు చేయించి డ్రామా ఆడించిన జగన్, తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను పూర్తిగా మరచిపోయారు. మోడీ ఎదుట సాగిలపడ్డారు. తన మీద ఉన్న అవినీతి కేసులు, తన ప్రియమైన తమ్ముడు అవినాష్ మీద ఉన్న హత్య కేసులనుంచి తమను తాము కాపాడుకోవడానికి మాత్రమే ఆయన మోడీతో భేటీలను వాడుకున్నారనే ప్రచారం ఉంది. జగన్ అయిదేళ్లలో ఎన్ని సార్లు ఢిల్లీ పెద్దలను కలిసినా.. ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టి.. ఫలానా డిమాండ్ చేశాం.. పలానా హామీ అటువైపునుంచి వచ్చింది.. అనే మాట చెప్పనేలేదు. కేవలం ప్రెస్ నోట్ లతోనే పొద్దుపుచ్చారు.

అలాంటిది అధికారం దిగిపోగానే.. వారికి మళ్లీ ప్రత్యేకహోదా గుర్తుకు వచ్చినట్లుంది. అవినాష్ ఆ అంశాన్ని లోక్ సభలో లేవనెత్తుతున్నారు. హోదా మాత్రమే కాదు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రెవేటీకరణ ఉండదని సాక్షాత్తు కేంద్రమంత్రి ప్రకటించిన తర్వాత ఇప్పుడు.. ప్రెవేటీకరణ వద్దని అంటున్నారు. అధికారంలో ఉండగా వైసీపీ ఆ టాపిక్ కనీసం ఎన్నడూ ప్రస్తావించలేదు. విశాఖ రైల్వేజోన్ కు కేంద్రం సిద్ధమవగా.. కనీసం స్థలాలు కేటాయించని జగన్ సర్కారు రాష్ట్రానికి ఆ మేరకు ద్రోహంచేసింది. తీరా ఇప్పుడు అవినాష్.. వెంటనే రైల్వేజోన్ ప్రారంభించాలని అంటున్నారు.

అవినాష్ బహుశా ఇన్నాళ్లూ తన మీద ఉన్న హత్యకేసు వ్యవహారాల్లో మునిగి రాజకీయ పరిణామాలు ఫాలో కాలేదేమో అని.. అందుకే, ఇప్పుడే నిద్రలేచి వచ్చినట్టుగా.. పొంతనలేని, తమ వైఫల్యాలను, తమ నాయకుడు జగన్ చేతగానితనాన్ని ఎత్తిచూపే మాటలు లోక్ సభలో మాట్లాడుతున్నారని ప్రజలు నవ్వుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories