ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. ప్రజలను ఒక్క ఛాన్స్ అడిగి దక్కించుకుని ఐదేళ్లపాటు విచ్చలవిడిగా దుర్మార్గమైన పరిపాలన సాగించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండాలో వారు చాలా స్పష్టంగా నిర్ణయించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ బయట ఉండాలి.. తాగేసిన గాజు గ్లాసు వంటింటి సింక్ లో ఉండాలి అంటూ.. ఏది ఎక్కడ ఉండాలో చాలా విపులంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి! ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండాలో తమ తీర్పు తాము చెప్పారు!! అందుకు భిన్నంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రజల తీర్పును అగౌరవపరచడం మాత్రమే అవుతుంది. అందుకు భిన్నంగా తాను ఒక పదవిని కోరుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి కి అత్యాశ అవుతుంది. ఇప్పుడు శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటూ జగన్ స్పీకరుకు లేఖ రాయడం చూసి జనం నవ్వుకుంటున్నారు.
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 10 శాతం సీట్లను ఆ పార్టీ గెలుచుకోవాలి అంటే 175 స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో పార్టీకి కనీసం 18 సీట్లు దక్కాలి. ఈ సంగతి జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే 2019 ఎన్నికల తరువాత అప్పట్లో 23 స్థానాలు గెలిచిన తెలుగుదేశం నుంచి నలుగురిని ఫిరాయింపజేసి తమలో కలిపేసుకున్న జగన్మోహన్ రెడ్డి తాను తలచుకుంటే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తానని శాసనసభలోనే బెదిరించారు. అంటే మరో ఇద్దరిని ఫిరాయించి తన పార్టీలో కలుపుకుంటే తెలుగుదేశం బలం 17 కు పడిపోతుందని అప్పుడు వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండదని ఆయన మాటల అంతరార్థం.
కానీ ఇప్పుడు ప్రజలు కేవలం 11 సీట్లు మాత్రమే తన పార్టీకి దయ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త రూల్స్ మాట్లాడుతున్నారు. 10 శాతం సీట్లు రావాలనే సంగతి చట్టంలో ఎక్కడా లేదని ఆయన నొక్కి వక్కాణిస్తున్నారు. మరి ఏ ధైర్యంతో గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు హోదాను మార్చేయగలనని ఆయన ప్రగల్భాలు పలికారో ఆయనకే తెలియాలి.
ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్లీజ్ అని స్పీకరును బతిమాలుతూ ఉంటే పరువు పోతున్నది కదా అని సొంత పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన బలాన్ని గౌరవించాలి- వారు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించాలి- హోదా కూడా లేకుండా ప్రతిపక్షంలో కూర్చోబెట్టినంత మాత్రాన వాళ్లు శాసనసభ్యులు కాకుండా పోరు. శాసనసభలో వారు తమ ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి అర్హత లేకుండా పోదు. మరి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే తప్ప సభలో చర్చలలో పాల్గొనడానికి సరైన భాగస్వామ్యం దక్కదని జగన్మోహన్ రెడ్డి తాను స్పీకరుకు రాసిన లేఖలో డొంకతిరుగుడుగా ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్థం కావడం లేదు. గతంలో 10 శాతానికి తగ్గినా ఎప్పుడెప్పుడు ఆ హోదా కట్టబెట్టారో ఆయన ఉదాహరణలు చెబుతున్నారు గాని, అవన్నీ కూడా అప్పటి పాలక పక్షాలు దయతో తీసుకున్న నిర్ణయాలు మాత్రమే తప్ప, వారికి హక్కుగా సంక్రమించిన హోదాలు కాదు అనే సంగతి ఆయన తెలుసుకోవాలి. లాజిక్ లేకుండా నాకు హోదా ఇస్తే తప్ప ఊరుకోను అన్నట్టుగా ఆయన ఇలాంటి చవక బారు లేఖలు రాస్తే ప్రజలు మరింతగా అసహ్యించుకుంటారు.