యలహంకలో జగనన్న: బలం పలచబడుతోంది ఇక్కడ!

ఓడిపోయిన నాటినుంచి పార్టీకి తిరిగి ప్రజాదరణ సాధించడం ఎలా? అనే దిశగా జగన్ చేస్తున్న కసరత్తు ఏదీ మనకు కనిపించదు. అదే సమయంలో.. తాడేపల్లి కి వచ్చి ఒకటి రెండు కార్యకర్తల సమావేశాలు పెట్టడం, ఒకటి రెండు ప్రెస్ మీట్ లు పెట్టి చంద్రబాబును తూలనాడడం, ఒకటి రెండు ట్వీట్లు పెట్టేలాగా సోషల్ మీడియా దళాలకు పురమాయింపు చేయడం.. ఆ వెంటనే బెంగళూరు యలహంక ప్యాలెస్ కు విహారానికి వెళ్లిపోవడం… రెండు నెలలుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఇది. తన సొంత పార్టీ మీద కాదు కదా, సొంత రాష్ట్రం మీదనే శ్రద్ధ లేనట్టుగా ఆయన ఎక్కువ సమయం బెంగళూరు ప్యాలెస్ లో గడపడానికి కేటాయిస్తున్నారు. ఇలాగ ఇక్కడ పార్టీ రోజురోజుకి చిక్కిపోతోంది. ఎమ్మెల్యే స్థాయి నాయకులు కొందరు రాజీనామాలు చేసి వేరే ఏ పార్టీలోనూ చేరకుండా ఖాళీగా ఉండడానికైనా ఇష్టపడుతున్నారు తప్ప, వైయస్సార్ కాంగ్రెస్ లో కొనసాగాలని అనుకోవడం లేదు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొందరు అధికార కూటమి పార్టీలలోకి ఫిరాయిస్తున్నారు. ఏ రకంగా చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ రోజు రోజుకు కొద్ది కొద్దిగా బలహీనపడుతూ ఉంది. పార్టీ పునర్నిర్మాణం గురించి జగన్ పెడుతున్న శ్రద్ధ కనిపించడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్ నూర్జహాన్ దంపతులు కూడా తెలుగుదేశం లో చేరిపోవడం విశేషం. 

రాష్ట్రంలో అనేక మునిసిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కబంధహస్తాల నుంచి విముక్తి పొంది కూటమి ముద్రకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని మునిసిపాలిటీల మీద కూటమి జెండా ఎగురుతోంది. తాజాగా ఏలూరు కూడా వారి పరం అవుతోంది. ఇంకా అనేక మునిసిపాలిటీలలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధులందరూ పార్టీ  ఫిరాయించి తెలుగుదేశం కూటమిలో చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. జగన్ పెద్దగా వ్యవహారాలు పట్టించుకుంటున్నట్టుగా లేదు. 

స్థానిక ప్రతినిధులు మాత్రం పార్టీ మారితే ఏదో అధికార పార్టీ వారు ప్రలోభ పెట్టారని నిందలు వేయవచ్చు. కానీ ఏలూరులో మునిసిపల్ చైర్మన్ నూర్జహాన్, భర్త పెదబాబు దంపతులతో పాటు, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసు కూడా పార్టీ మారుతున్నారు. దీనిని బట్టి ద్వితీయ శ్రేణి నాయకులలో ఎవ్వరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ భవిష్యత్తు మీద నమ్మకం లేదని.. తమ రాజకీయ భవిష్యత్తు స్థిరంగా ఉండాలంటే కూటమి పార్టీలలో చేరడం ఒక్కటే మార్గమని భావిస్తున్నట్లు అనుకోవాల్సి వస్తుంది. 

జగన్మోహన్ రెడ్డి మేలుకొని పార్టీని గాడిలో పెట్టాలని అనుకునే లోగా నాయకులు ఎవరూ మిగలరేమో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినప్పుడు అనేక రకాల బెదిరింపులు, ప్రలోభాల ద్వారా మెజారిటీ మున్సిపాలిటీలను పంచాయతీలను చేజిక్కించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఇప్పుడు గుణపాఠం లాగా ఈ ఫిరాయింపులు సాగుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories