కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో చిన్న చిన్నమార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద పైచేయి సాధించడం ఒక్కటే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్న కాంగ్రెస్.. అందుకు తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులతో ముందుకు సాగుతోంది. జగన్ సోదరి వైఎస్ షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు స్వీకరించిన తర్వాత.. ఆయనకు ఊపిరాడనివ్వని విధంగా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వైఎస్ అభిమాన ఓటు బ్యాంకును ఆమె చీల్చగలదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుండగా.. కనీసం కొన్ని సీట్లయినా గెలిచి ఏపీలో కాంగ్రెస్ అస్తిత్వాన్ని పునఃప్రతిష్ఠించాలని షర్మిల పట్టుదలగా ఉన్నారు. ఎవరు ఎక్కడినుంచి పోటీచేయాలనే విషయంలో రకరకాల ఆలోచనలు సాగినప్పటికీ.. ఫైనల్ గా కడప ఎంపీ స్థానానికి జగన్ ప్రియమైన తమ్ముడు అవినాష్ రెడ్డి మీద పోటీచేయడానికి ఒకప్పటి జగనన్న బాణం, కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిల రెడ్డి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించిందని వార్తలు వస్తున్నాయి.
జగన్ మీద విమర్శల దాడి చేయడానికి, జగన్ అరాచకత్వాన్ని నిర్భయంగా ప్రశ్నించడానికి ఇప్పుడు ఆయన సొంత కుటుంబంనుంచే ఇద్దరుముగ్గురు కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. వైఎస్ షర్మిలతో పాటు, హత్యకు గురైన బాబాయి వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆయన భార్య సౌభాగ్యమ్మ కూడా జగన్ అరాచకాల్ని ప్రశ్నిస్తున్నారు. నిజానికి సౌభాగ్యమ్మ, కూతురు సునీతలది ఇన్నాళ్లూ ఒంటరి పోరాటం కాగా.. ఇప్పుడు షర్మిల వారితో జత కలిశారు.
కడప ఎంపీ స్థానం, పులవెందులు ఎమ్మెల్యే స్థానం నుంచి వీరిద్దరినీ పోటీచేయించాలని, ఎవరు ఎక్కడనేది తర్వాత నిర్ణయించాలని పార్టీ భావించినట్లు వార్తలు వచ్చాయి. షర్మిల రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించి, పార్టీకి ఊపు తీసుకువస్తారని అనుకున్నారు.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ మార్చింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య లో కీలక సూత్రధారిగా విమర్శలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద పోటీచేయడానికి షర్మిలనే పురమాయించినట్లుగా తెలుస్తోంది. వివేకా భార్య, కూతురుల్లో ఒకరిని పోటీచేయించడం కంటె.. స్వయంగా షర్మిల పోటీచేస్తేనే ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని వారు భావిస్తున్నారు. షర్మిల రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తే.. ఓటు శాతం పెరుగుతుందేమో గానీ సీట్లు దక్కవని, అదే ఆమె కడపలో ఎంపీగా పోటీచేస్తే ఖచ్చితంగా ఒక ఎంపీ సీటు గెలవవచ్చునని కాంగ్రెస్ భావిస్తోంది.
వైఎస్ షర్మిల స్వయంగా కడప ఎంపీ బరిలో పోటీచేస్తే, అక్కడి ప్రచారానికి మాత్రమే పరిమితం అయితే.. రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రచారం చేయడానికి వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీతల్లో ఒకరి సేవలను వాడుకోవాలని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.