మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుంగనూరు పర్యటనను రద్దు చేసుకున్నారా? పుంగనూరులో హత్యకు గురైన ఏడేళ్ల బాలిక అస్పియా కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి 9వ తేదీను పుంగనూరుకు వస్తారని ఆయన అధికారిక టూర్ షెడ్యూలును ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. ఇప్పుడు పన్నెండో సారి బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో విలాసంగా గడపడానికి సతీసమేతంగా వెళ్లి ఉన్న జగన్మోహన్ రెడ్డి.. తిరుగు ప్రయాణంలో 9వ తేదీన అస్పియా కుటుంబాన్ని పరామర్శించడానికి పుంగనూరు వస్తారనేది సమాచారం. అయితే ఇప్పుడు ఆ ప్రోగ్రాం మారినట్టుగా పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది.
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుంగనూరు వస్తారనే ప్రోగ్రాం ముందుగా ప్రకటించడంతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి ఇద్దరూ పుంగనూరు వెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. అక్కడి తమ శ్రేణులందరినీ పోగేసి ఎలాంటి ప్రతిఘటనలు ఎదురుకాకుండా.. తెలుగుదేశం వారు జగన్ కు వ్యతిరేకంగా ఎలాంటి నిరసన చేసినా గట్టిగా తిప్పికొట్టడానికి వ్యూహరచన చేశారు. ఒకవైపు వారు ఈ ప్రయత్నాల్లో ఉండగానే.. జగన్ పుంగనూరు పర్యటించాలనే ఆలోచనను విరమించుకుంటున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ముస్లిం బాలిక అస్పియా హత్యకు గురికావడంతో.. ఆ చావును పొలిటికల్ ఎడ్వాంటేజీగా మార్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారు. గతంలో గుంటూరు జిల్లాలో కూడా వైసీపీ కార్యకర్త అయిన ఒక ముస్లిం యువకుడు హత్యకు గురైతే.. దానిని రాజకీయ హత్యగా రంగుపులిమి రాద్ధాంతం చేయడానికి జగన్ విఫలయత్నం చేశారు. చివరికి ఆయన ఆరోపణలే తేలిపోయాయి. ఇప్పుడు పుంగనూరులో కూడా ముస్లిం బాలిక హత్యకు గురికావడంతో జగన్ మళ్లీ అదే కుట్ర చేశారు. చంద్రబాబునాయుడు పాలనలో ముస్లింలకు, అమ్మాయిలకు రక్షణ లేదని ఆరోపించడానికి ఆయన స్క్రిప్టు రాయించుకున్నారు. కాకపోతే బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో నాలుగురోజులు సరదాగా విలాసంగా గడిపిన తర్వాత ఇటు పుంగనూరు రావాలని అనుకున్నారు.
కానీ.. ఆదివారం నాడు పుంగనూరు పోలీసులు హత్యకేసును ఛేదించారు. ఒక మహిళ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. బాలిక తండ్రి చేసే ఫైనాన్స్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల వద్ద విభేదాల కారణంగానే హత్య జరిగినట్టుగా తేల్చారు. అలాగే బాలికపై అత్యాచారం జరగలేదని పోస్టుమార్టం నివేదికలో వచ్చినట్టుగా తేటెతెల్లం చేశారు. అయితే హత్యకు కారణాలన్నీ స్పష్టంగా వెలుగులోకి రావడంతో.. చంద్రబాబునాయుడు మీద బురద చల్లి ఆనందించాలని అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఆశలు భంగపడ్డాయి. ఇక పుంగనూరు వెళ్లినా ఉపయోగం లేదని.. వేరే ఇతర కారణాలు చూపించి.. పర్యటన రద్దు చేసుకోవాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.