కొత్త లిక్కరు పాలసీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇంకా గొంతు చించుకుంటున్నారు. పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు. అయితే అవన్నీ అర్థం లేని ఆరోపణలు! కేవలం ఆరోపణలు మాత్రం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే జగన్ కుట్రపై, ఆయన ఆరోపణలకు సరైన వివరణలతో నిజాల్ని తెలియజెప్పేందుకు తెలుగుమోపో డాట్ కామ్ చేస్తున్న ప్రయత్నం ఇది.
జగన్ ఆరోపణ : వైసీపీ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా లైసెన్సు ఇవ్వలేదు.
వివరణ : జగన్మోహన్ రెడ్డి చాలా సునాయాసంగా ఒక ఆరోపణ చేస్తున్నారు. వైసీపీ పరిపాలించిన అయిదు సంవత్సరాల కాలంలో ఒక కొత్త డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని, అన్నీ చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చిన డిస్టిలరీలతోనే మద్యం సరఫరా అయిందని అంటున్నారు. నిజానికి ఇది జగన్ సర్కారు వేసిన తెలివైన ఎత్తుగడ. ఆయన చెప్పింది అక్షరాలా నిజం. జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా లైసెన్సు ఇవ్వలేదు. కానీ వారు చేసిన దందా వేరే ఉంది. చంద్రబాబునాయుడు హయాంలో అనుమతులు తెచ్చుకున్న డిస్టిలరీల యజమానుల నుంచి ఆ వ్యాపారాలను కబ్జా చేశారు. వారిని బెదిరించి.. భయపెట్టి.. ప్రలోభ పెట్టి, తమకు అమ్మకపోతే అసలు రాష్ట్రంలో వ్యాపారాలే చేైసుకోలేరని హెచ్చరించి.. రకరకాలుగా ఇబ్బందిపెట్టి.. ఆ డిస్టిలరీలన్నింటినీ జగన్ అనుచరులు, తొత్తులు చేజిక్కించుకున్నారనే ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకులు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరికొందరు కీలక నాయకుల అనుచరుల పేర్లతో డిస్టిలరీల యాజమాన్యాలు మారిపోయాయి. బినామీల పేరుమీద ఆ వ్యాపారాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. తమ అనుచరుల చేతిలో ఉన్న డిస్టిలరీలకు మాత్రమే ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. ఇది కేవలం దోపిడీ మాత్రమే కాదు. దందా మరియు దోపిడీ అని చెప్పాలి.
జగన్ ఆరోపణ : అప్పుడు నాసిరకం లిక్కర్ అన్నారు.. ఇప్పుడు నాణ్యమైన మద్యం అంటున్నారు.
వివరణ : అవే డిస్టిలరీల నుంచి ఇప్పుడు కూడా మద్యం సరఫరా అవుతున్నప్పుడు అప్పుడు మాత్రం నాసిరకం మద్యం అనిచెప్పి, ఇప్పుడు మాత్రం నాణ్యమైన మద్యం అని చెప్పడం తప్పు కదా అనేది జగన్ రెడ్డి వాదన. ఈ వాదన కూడా ఖచ్చితంగా నిజమే. కానీ అప్పట్లో అన్నీ నాయకుల సొంత డిస్టిలరీలు గనుక.. తయారీలో కూడా విచ్చలవిడిగా చెలరేగారు. కానీ ఇప్పుడు ప్రమాణాలు పాటించి చేయడం జరుగుతోంది. ఏమాత్రం తేడా వచ్చినా అసలు లైసెన్సు పోతోందనే భయంతో ఒళ్లు దగ్గరపెట్టుకుని చేస్తున్నారు. దానికి తోడు కేవలం ఇక్కడి డిస్టిలరీలు సరఫరా చేసే చీప్ లిక్కర్ మాత్రమే కాదు. ఆ చీప్ లిక్కర్ విషయంలో మాత్రమే జగన్ మాటలు వర్తిస్తాయి. కానీ జగన్ అసలు తన పాలన కాలంలో అందుబాటులో లేకుండా చేసిన ప్రముఖ బ్రాండ్ల లిక్కరులన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి. మద్యం అలవాటు ఉన్నవారు ఇష్టపడే బ్రాండెడ్ లిక్కరు ఏదీ గతంలో లేదు. ఇప్పుడు అవన్నీ దొరుకుతున్నాయి. నాణ్యమైన మద్యం అనే మాట.. వాటికి వర్తిస్తుంది కదా.
జగన్ ఆరోపణ : లిక్కర్ రేట్లు తగ్గిస్తామని ఎన్నికల ముందు చెప్పారు.. గెలిచిన తర్వాత రేట్లు రెండు మూడింతలు పెంచారు.
వివరణ : జగన్ చీప్ లిక్కర్ తప్ప మరేమీ దొరక్కుండా చేసి, వాటి ధరను సుమారు రూ.200 వద్ద క్వార్టరు బాటిలు దొరికేలా ఉంచారు. చీప్ లిక్కరు క్వార్టరు రూ.99కు ప్రస్తుతం అమ్ముతున్నారు. ఈ ధర తగ్గింపు జగన్ రెడ్డికి కనిపించలేదా? స్వదేశీ తయారీ విదేశీ లిక్కరు విషయంలో మాత్రమే ఎమ్మార్పీ ధరను ఆ తర్వాత పది రూపాయల వరకు రౌండ్ ఫిగరు చేసేలా మాత్రమే పెంచారు. రెండింతలు మూడింతలు అనేది జగన్ ప్రజలకు చెబుతున్న పచ్చి అబద్ధం. కొన్ని కాస్ట్ల్ లీ బ్రాండ్ లిక్కర్లు ధర ఎమ్మార్పీ కంటె తర్వాత రూ.10 పెంపు తప్ప వేరేగా ధరలు పెంచి అమ్మడం అనేది రాష్ట్రంలో లేనే లేదు.
జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అమాయకులంటే.. తాను చెప్పే కల్లబొల్లి కబుర్లను ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు. కానీ.. ప్రజలు ఆయనకంటె తెలివైన వాళ్లని, వారికి నిజాలు తెలుసునని, అందుకే జగన్ ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారని ఆయనకు అర్థం కావడం లేదు.