జగనన్న పదవులు ఇచ్చింది దళారీ పనులకేనా?

వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను మాత్రమే కాదు, అక్కడr వ్యవస్థను కూడా గాడి తప్పించారని, భ్రష్టు పట్టించారని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలో శాసనకర్తల స్థాయి పదవులను దక్కించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరిట తిరుమల దేవుడి దర్శనార్థం దళారీ వ్యవహారాలు మిక్కుటంగా జరగడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. తోమాల సేవ పేరిట సిఫారసులేఖను విక్రయించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ భరత్ మీద తాజాగా గుంటూరులో కేసు నమోదు అయింది.

ఈ సిఫారసులేఖ ఇచ్చిన ఎమ్మెల్సీ భరత్- కుప్పంలో చంద్రబాబు నాయుడు మీద ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి కావడం గమనార్హం. ఈ ఒక్క వ్యవహారాన్ని లోతుగా విశ్లేషిస్తే చాలు… జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నాయకులను ప్రోత్సహిస్తూ వచ్చారో అర్థం అవుతుంది అని విశ్లేషకులు అంటున్నారు.
కుప్పంలో చంద్రబాబు నాయుడు ప్రాభవానికి గండి కొట్టడానికి, స్థానికంగా భరత్ అనే నేతను జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించిన సంగతి అందరికీ తెలిసిందే.

అలాగే కుప్పం స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం వారిని భయపెట్టి బెదిరించి నామినేషన్లు వేయకుండా అడ్డుకొని మొత్తానికి వైసీపీ పైచేయిని చూపించుకున్నారు. కుప్పం మునిసిపాలిటీని కూడా దక్కించుకున్నారు. ‘మీ నాయకుడిని ఒకసారి రమ్మనండి మొహం చూడాలని ఉంది’ అంటూ కుప్పం మునిసిపాలిటీ తాము గెలిచామనే అహంకారంతో జగన్మోహన్ రెడ్డి కన్ను మిన్ను కానకుండా మాట్లాడిన వైనం కూడా ప్రజలు గమనించారు. స్థానికంగా కుప్పంలో చంద్రబాబుకు దీటుగా రాజకీయం నడపడానికి అక్కడి తెలుగుదేశం వర్గీయులను నిత్యం అణిచివేస్తూ ఉండడానికి భరత్ ను ఎమ్మెల్సీ చేసి చట్టబద్ధమైన హోదా గల పదవిని కూడా కట్టబెట్టారు.

తీరా పదవిలోకి వచ్చి భరత్ ఏం ఉద్ధరించారు? తిరుమల దేవుడి దర్శనానికి ఇచ్చే సిఫారసు లేఖలను అమ్ముకున్నారని ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి! గుంటూరులో తెలుగుదేశం నాయకుడు చిట్టిబాబు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్సీ భరత్ తో పాటు ఆయన పిఆర్ఓ మల్లికార్జున పైన కూడా కేసు నమోదు అయింది.  తోమాల సేవ కోసం సిఫారసు లేఖ ఇచ్చినందుకు 3 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో తిరుమల దర్శనార్థం సిఫారసులేఖలు ఇచ్చే స్థాయి పొందిన వారందరూ కూడా వాటిని విచ్చలవిడిగా అమ్ముకుంటూ దళారీ సొమ్ము దండుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి పదవిని కూడా వెలగబెట్టిన ఒక నాయకురాలు ఇలాంటి దర్శనాల దందా ద్వారా ప్రతి నెల 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు తన పిఆర్వోలకు టార్గెట్ పెట్టి మరీ వసూలు చేసేదని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పతనం జరిగిన తర్వాత ఆయన పాలన కాలంలో సాగించిన అరాచకాలు తిరుమల దర్శనాల విషయంలో చోటు చేసుకున్న దళారీ పనులు సహా సమస్తం వెలుగులోకి వస్తున్నాయి!

Related Posts

Comments

spot_img

Recent Stories