ఎన్నికల్లో ఓడిపోయిన నాటినుంచి జగన్మోహన్ రెడ్డి చక్కగా తాడేపల్లికి- బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు మధ్య షటిల్ విమాన సర్వీసుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యమధ్యలో తాడేపల్లిలో గ్యాప్ దొరికితే పార్టీ వారిని పిలిపించి.. వారికి కొంత సమయం కేటాయిస్తున్నారు. అంతే తప్ప.. యలహంకలో పార్టీ వ్యవహారాలు మాట్లాడ్డానికి నరమానవుడిని కూడా దగ్గరకు రానివ్వడం లేదు. ఆయన ప్రభుత్వం మీద చేస్తున్న పోరాటాలు యావత్తూ.. ఏదో తనకు భజన చేసే ఇష్టమీడియాకు చెందిన కొందరిని పిలిపించుకున్న ప్రెస్ మీట్ల రూపంలోనూ, ఎక్స్ వేదికగానూ మాత్రమే జరుగుతూ ఉందన్నది నిజం. అయితే.. ఈ తరహా మాటల పోరాటాలు పార్టీ పరువు తీస్తుండగా.. సంక్రాంతి తర్వాత.. జిల్లాల్లో యాత్రలు చేస్తానని.. ప్రతి వారం రెండో రోజుల పాటు ఒక్కో జిల్లాలో గడుపుతానని, అక్కడి కార్యకర్తలతో భేటీలు అవుతానని, ప్రజల పక్షాన పోరాటాలు చేద్దామని.. జగన్ చాలా చాలా కబుర్లు చెప్పారు. కానీ తాజా పరిణామాలను గమనిస్తోంటే.. జగనన్న జిల్లా యాత్రలు సంక్రాంతి తర్వాతి నుంచి కాకుండా.. ఇంకా చాలా దూరం వాయిదా పడేలా కనిపిస్తున్నాయి.
ఇందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి- జగన్ విదేశీయాత్ర కాగా, రెండు- పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనంగా మారుతున్నదనే భయం!
జగన్మోహన్ రెడ్డి కూతురు గ్రాడ్యుయేషన్ డే లండన్ లో ఈనెల 16న జరుగుతుందనే సంగతి హఠాత్తుగా నిర్ణయం అయ్యేదేమీ కాదు. కాకపోతే.. జగన్ తన కంటితుడుపు జిల్లా యాత్రలను ఆ తేదీకంటె ముందునుంచే ప్రకటించారు. తీరా తేదీ దగ్గరపడ్డాక నా కూతురు దగ్గరకు వెళ్లాలి.. అనుమతి ఇవ్వండి అంటూ కోర్టును ఆశ్రయించారు. కూతురు గ్రాడ్యుయేషన్ డేకు వెళ్లడానికి కోర్టు అనుమతి లభించింది. అలాగే ఆయన పాస్ పోర్టు రెన్యువల్ కు సంబంధించి ప్రజాప్రతినిధులు ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేస్తూ హైకోర్టు ఐదేళ్లపాటు పునరుద్ధరించాలని కూడా ఆదేశించింది. జగన్ 11న రెండు వారాల పాటు విదేశీయాత్రకు వెళితే.. అక్కడితో ఈ నెల దాదాపుగా గడచిపోతుంది. అంటే సంక్రాంతికి అని చెప్పిన జిల్లా యాత్రలు.. ఫిబ్రవరిలోగానీ మొదలుకావు.
కానీ.. అప్పటికి కూడా అనుమానమే. తాజాగా విద్యుత్తు చార్జీల పెంపు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని వైసీపీ పిలుపు ఇస్తే రాష్ట్రంలో 19 నియోజకవర్గాల్లో అసలు ఆ ఊసే కనిపించలేదు. ఇది జగన్ చాలా అవమానంగా భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అంతేకాకుండా పార్టీ క్షేత్రస్థాయిలో బలహీన పడుతున్నదనే సంకేతాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో జిల్లా యాత్రలు నిర్వహిస్తే గనుక.. ఆచితూచి.. తమ బలం బాగా కనిపించే చోట్లకే వెళ్లాలని అనుకుంటున్నారు. బలం కనిపించాలంటే భారీగా ఖర్చు పెట్టుకోవాలి. అంత ఖర్చు పెట్టుకోగలిగే స్థానిక నాయకులు ఉండే చోట్లకు మాత్రమే తొలుత పర్యటనలు సాగించాలని భావిస్తున్నారు. ఈ సమీకరణాలు అన్నీ ప్లాన్ చేసుకోవడానికి, ఖర్చులకు విముఖంగా ఉన్న లోకల్ లీడర్లను బుజ్జగించడానికి మరికొంత కాలం పడుతుందని అనుకుంటున్నారు. ఎలా చూసినా సరే.. జగన్ జిల్లా యాత్రలు మరింత ఆలస్యం అవుతాయనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.