‘మరణించే ముందు ఎవ్వరూ అబద్ధం చెప్పరు’.. అనేది మనకు ఒక నమ్మకం. ఈ కాన్సెప్ట్ మీద ఆధారపడి మనకు అనేక సినిమాలు కూడా తయారయ్యాయి. ఈ సూత్రాన్ని రాజకీయాలకు అన్వయించుకుంటే.. పార్టీని వదలి, గుడ్ బై కొట్టి వెళ్ళిపోయే సమయంలో కూడా ఎవ్వరూ అబద్ధాలు చెప్పరు అనే అనుకోవాలి. మరి అలాంటి వారు చెబుతున్న మాటలని పార్టీ అధినేత పరిగణనలోకి తీసుకోవాలా వద్దా? ఆ అధినేత అయినా.. ఈగోలు లేకుండా నిజంగా తన పార్టీ క్షేమాన్ని కోరుకునే వాడు అయితే.. వెళ్ళిపోయే వారి మాటల్ని పట్టించుకోవాలి. కానీ.. వైసిపికి గుడ్ బై కొట్టి వెళుతున్న వారి గోడు జగన్ కు అసలు వినిపిస్తోందా అనేది ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉంది.
పైగా.. వెళ్ళిపోతున్న నాయకులు అందరూ ఒకే తరహా ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పలువురు నాయకులు వైసీపీని వీడిపోయారు. టికెట్లు దక్కని వారు గుడ్ బై కొట్టడం విశేషమేమీ కాదు. కానీ వారిలో కూడా పలువురు ఒకటే రకం ఆరోపణలు పార్టీ మీద చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత ఇప్పటికే ముగ్గురు తాజా మాజీ ఎమ్మెల్యేలు గుడ్ బై కొట్టారు. మద్దాలి గిరి, కిలారు రోశయ్య, పెండెం దొరబాబు వెళ్ళిపోయారు. వీరందరికీ కూడా ఒకటే మాట. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తమకు సాధారణ కార్యకర్తకు దక్కే గౌరవం కూడా దక్కలేదని వారు వాపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడే గాని. ఆయన చుట్టూ ఉన్న కోటరీ పార్టీని సర్వనాశనం చేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు.
ఏదో ఒక నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేస్తే ఎవరి మీద అయినా వ్యక్తిగత ద్వేషంతో చెబుతున్నారని అనుకోవచ్చు. కానీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్న అందరూ ఇదే మాట చెబుతుంటే పట్టించుకోకపోతే ఎలా? నిజానికి పార్టీలో కొనసాగుతున్న వారు కూడా అనేకమంది ఇదే తరహా ఆరోపణలు చేస్తున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిజంగానే తన పార్టీని కాపాడుకోవాలని ఆలోచన ఉన్న నాయకుడు అయితే కనుక.. కచ్చితంగా ఈ మాటలను పరిగణనలోకి తీసుకోవాలి. తల చుట్టూ గోడ లాగా మారి తనకు కార్యకర్తలకు సాధారణ నాయకులకు మధ్య ఉండవలసిన అనుబంధానికి గండి కొడుతున్న కోటరీ అనుచరులను పక్కన పెట్టాలి లేదా వారి ప్రాధాన్యం తగ్గిం.. అని పలువురు కోరుకుంటున్నారు. అహంకారంతో ఉండే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి హిత వాక్యములు చెవికి ఎక్కుతాయా అనేది చాలామందిలో ఉన్న సందేహం!