జగన్ : నా దయ లేకుండా మీరు బాగుపడరాదు!

ఆయనను పులివెందుల ప్రజలు నమ్మి మళ్లీ గెలిపించారు. రాష్ట్రప్రజలు అదే స్థాయిలో నమ్మకపోవడం వలన..  ఆయన కేవలం 11 సీట్లకు పరిమితం అయిన ఒక సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలాంటిదంటే.. తనతో పాటు మరో పదిమంది పార్టీ నాయకులను వారి వారి నియోజకవర్గాల ప్రజలు గెలిపించినా సరే.. వారు పదవులు అనుభవించడం ఆయనకు ఇష్టం లేదు. వారెవ్వరూ సభకు పోకుండా అడ్డకుంటున్నది అందుకే.

అదే తరహాలో.. తనకు ప్రతిపక్ష నేత హోదా లేనప్పుడు.. తన పార్టీని నమ్ముకుని ఉన్న ఏ చిన్న స్థాయి కార్యకర్త, చిన్న నాయకుడు కూడా ఏ చిన్న పదవిని కూడా అనుభవించ కూడదు అనేదే ఆయన పాలసీగా కనిపిస్తోంది. అంటే ‘జగన్ వైఖరి ఏం చెబుతున్నదంటే.. నేను దయపెడితే మీరు పదవులు అనుభవించాలి.. లేకపోతే మీరు పదవులు అనుభవించడానికి వీల్లేదు. నాకు ప్రతిపక్ష హోదా పదవి దక్కలేదు కాబట్టి.. మిమ్మల్ని ఎవ్వరినీ దయపెట్టను.. మీరు పదవులు పొందరాదు’ అన్నట్టుగా ఉంది.  నీటి సంఘాల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీచేయకుండా దూరం ఉండిపోవడం వెనుక అసలు రహస్యం ఇదే అని తెలుస్తోంది.

రాష్ట్రంలో నీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి తమ పార్టీ వారిని వేధిస్తున్నదనే చవకబారు ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ ఈ ఎన్నికలను పూర్తిగా బహిష్కరించింది. అసలు పోటీ లేకపోవడంతో.. తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఏకపక్షంగా నీటి సంఘాల ఎన్నికలను సొంతం చేసుకుంది. కొన్నిచోట్లు తెలుగుదేశం పార్టీ వారి మధ్యనే పోటీ ఏర్పడి రచ్చలయ్యాయి కూడా.

ఇదంతా పక్కన పెడితే.. ప్రభుత్వాధికారంలో తాను లేను గనుక.. అది నీటి సంఘం కావొచ్చు. మరొటి కావొచ్చు.. తన పార్టీ ప్రాపంకంతో ఎవ్వరూ కూడా ఎలాంటి అధికార వైభవాన్ని అనుభవించడానికి వీల్లేదని జగన్ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏ ఎన్నికల్లోనూ తమను పోటీచేయనివ్వకుండా అధికార పార్టీ తొక్కేస్తున్నదని నిందలు వేయడానికి జగన్ ఇలా తన పార్టీ వారిని తానే తొక్కేస్తున్నారని కూడా వినిపిస్తోంది.

రాష్ట్ర అధికారంలో తాను లేకుండా.. తన పార్టీ వారు నీటి సంఘాలు, ఇతర పదవులకు గెలిస్తే.. తన అవసరం లేకుండానే వారు బాగుపడడం జరుగుతుందని.. అప్పుడిక తన మాటకు వారివద్ద చెల్లుబాటు ఉండదని జగన్ భయపడుతున్నట్టు సమాచారం. పైకి కేవలం అధికార పార్టీ మీద నింద వేయడమే అయినా.. లోలోన కేవలం తన ప్రయారిటీ తగ్గకుండా ఉండడానికే నీటి సంఘాల్లోల పోటీలనుంచి తప్పించినట్టుగా అంతా అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories