ఆటంకాలు దాటితేనే కదా జగన్.. తమరు హీరో అయ్యేది!

ముందుగా ఓ కథ చెప్పాలి. వ్యాసాలు రాయడంలో పోటీ ఉంటుందని టీచరు ముందే చెప్పిపంపాడు. ఓ పిల్లవాడు ఆవు వ్యాసం తప్ప మరేమీ చదువుకోకుండా వచ్చాడు. టీచరు విమానం గురించి రాయమని అడగ్గానే.. విమానం గాలిలో ఎగురును గాలిలో వెళుతుండగా చూస్తే.. కింద నేలపై ఆవు కనిపించును. ఆవుకు నాలుగు కాళ్లుండును, రెండు కొమ్ములుండును, పొదుగు ఉండును, ఆవు పాలిచ్చును.. అని రాసుకుంటూ పోయాడు. ఆలయం గురించి రాయమని అడిగితే.. ఆలయంలో దేవుడు ఉండును. అలాగే గోశాల ఉండును. గోశాలలో ఆవు ఉండును.. ఆవుకు నాలుగు కాళ్లుండును, రెండు కొమ్ములుండును, పొదుగు ఉండును, ఆవు పాలిచ్చును.. అని రాసుకుంటూ పోయాడు. ఇలా సబ్జెక్టు ఏది ఇచ్చినా కూడా ఆవు గురించి రాసుకుంటూ పోయాడు. అంతటి మహాప్రబుద్ధుడు అన్నమాట.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత వ్యవహార సరళి కూడా అంతకంటె గొప్పగా ఏమీ లేదు. ఆయనకు అత్యంత బాగా తెలిసిన విద్య ఎదుటివారి మీద నిందలు వేయడం. ఎదుటివారు అనడం కంటె.. చంద్రబాబుమీద అంటే ఇంకా బాగుంటుంది. పవన్ కల్యాణ్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో.. ప్రపంచానికి చాటిచెబుతూ తిరగడం మాత్రమే. అంతకుమించి.. ఆయన తనలోని హీరోయిజాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయడంలేదు.

రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లను అడ్డగోలుగా వాడుకుని.. వారిద్వారా ప్రజలను ప్రలోభాలకు గురిచేయవచ్చునని, జగన్ కు ఓటు వేయకపోతే.. పించన్లు రావు అని బెదిరించవచ్చునని వైఎస్సార్ కాంగ్రెస్ రకరకాల ప్లాన్లు వేసింది. అయితే ఈ రెండు నెలల పాటూ.. వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి డబ్బులు పంపిణీ చేయరాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఫిర్యాదు చేసినది సిటిజన్ ఫోరమ్ ఫర్ డెమాక్రసీ అనే సంస్థ. అయితే.. జగన్ మాత్రం ఏదో ఆవు వ్యాసం రాసినట్టుగా ఈ వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నాడు. ఏప్రిల్ 1 నుంచి పింఛన్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నాడని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఆటంకాలు సృష్టించారని జగన్ ఆరోపిస్తున్నారు.

అయినా జగన్ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. చంద్రబాబు ఆటంకాలు సృష్టించిన మాట నిజమే అనుకుందాం.. వాటిని దాటుకుని వెళ్లి.. ప్రతి ఇంటికీ పెన్షనును ఇతర యంత్రాంగం ద్వారా చేరవేస్తేనే కదా జగన్ లోని చిత్తశుద్ధి బయటపడేది. ఆయన హీరోయిజం తెలిసి వచ్చేది. అవ్వాతాతల మీద మాటల్లో ప్రేమ కురిపించే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఇళ్లకు ఇప్పుడు కూడా పింఛను చేరిస్తే.. చంద్రబాబు ఎన్ని ఆటంకాలు సృష్టించినా సరే.. తాను చేశానని గొప్పగా చెప్పుకోవచ్చు కదా.. ఆ ప్రయత్నం ఆయన ఎందుకు చేయడం లేదు.. అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories