కన్నతల్లి వైఎస్ విజయమ్మను, సొంత చెల్లి వైఎస్ షర్మిలను .. జగన్మోహన్ రెడ్డి ఓడించారు. కంపెనీల ట్రిబ్యునల్ ఎన్‌సిఎల్‌టి సాక్షిగా ఆయన వారిపై పైచేయి సాధించారు. గతంలో వారికి గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేసిన షేర్లు వారికి దక్కకుండా నిలుపుదల చేయించడంలో ట్రబ్యునల్ జగన్ పిటిషన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే.. తల్లికి ఇచ్చిన షేర్లను తిరిగి తనకు కావాలంటూ వేసిన పిటిషన్లో.. ఆయనకు ఆ హక్కేలేదని విజయమ్మ తరఫు న్యాయవాదులు వాదించారు. తాజాగా తీర్పు ఇచ్చిన ట్రిబ్యునల్ మాత్రం.. జగన్ బదిలీచేసిన షేర్లను ఆయన కోరిక మేరకు నిలుపుదల చేస్తూనే.. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళ్లడానికి విజయమ్మ, షర్మిలలకు అవకాశం కల్పించింది. దాంతో ట్రబ్యునల్ తీర్పు వలన ఊరట ద్వారా కలిగిన సంతోషం జగన్ కు తాత్కాలికమే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా అన్ని వ్యవహారాల్లోనూ అనూహ్యమైన ఎదురుదెబ్బలు తగులుతున్న తరుణంలో ఇదొక గొప్ప ఊరట. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీపై జగన్ వేసిన పిటిషన్ ను ట్రిబ్యునల్ అనుమతించింది. ఆయన కన్నతల్లి విజయమ్మకు, చెల్లెలు షర్మిలకు గతంలో గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేసిన వాటాలను నిలుపుదల చేస్తున్నట్టుగా తీర్పు ఇచ్చింది. ఏడాదికి పైగా తల్లికి ఇచ్చిన కానుకను తిరిగి వెనక్కు లాక్కోవడానికి జగన్ సాగించిన పోరాటం ఆయనకు అనుకూలంగానే ఫలించింది.
ఒకసారి గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత షేర్లను వెనక్కు అడిగే హక్కు జగన్, వైఎస్ భారతికి లేనేలేదని వైఎస్ విజయమ్మ తరఫున వినిపించిన వాదనలు తేలిపోయాయి. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉండగా కుటుంబానికి సమకూరిన ఆస్తులన్నీ కూడా ఉమ్మడిగా నలుగురు పిల్లలకు చెందుతాయని విజయమ్మ, కోర్టు బయట చెప్పుకున్న కుటుంబ వాదనలన్నీ కూడా గాలికి కొట్టుకుపోయాయి. ప్రస్తుతానికి జగన్ నెగ్గారు.
అయితే, ట్రిబ్యునల్ తీర్పును విజయమ్మ, షర్మిల హైకోర్టులో సవాలు చేయబోతున్నట్టుగా సమాచారం.
వీరికి ట్రిబ్యునల్ ఈ అవకాశం కల్పించింది. తమకు బదిలీ అయిన వాటాలపై యథాతథ స్థితి కొనసాగేలా ఉత్తర్వులు ఇచ్చేలాగా.. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సమీక్షించి న్యాయం చేసేలాగా విజయమ్మ మరియు షర్మిల హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. తనకు ఇప్పుడు అమ్మ మీద ప్రేమ లేదు గనుక.. వాటాలు తిరిగి ఇవ్వాలని అనడంలో న్యాయబద్ధత లేదని, హైకోర్టులో విజయమ్మకు అనుకూలంగా తీర్పువచ్చే అవకాశం ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. హైకోర్టు తీర్పు వెలువడే దాకా జగన్ కు దక్కిన ప్రస్తుత ఆనందం, తాత్కాలికంగా ఉంటుందని.. తర్వాత ఎదురుదెబ్బకు సిద్ధమై ఉండాలని వారంటున్నారు.