జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రత్యర్థులు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ప్రభృతులు తిట్టడం ఒక ఎత్తు. వాళ్లు ఎటూ ఆయనకు ఎప్పటినుంచో శత్రువులు గనుక ఖచ్చితంగా తిడతారనే నమ్మవచ్చు. కానీ కిందటి ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి తన చెమట నెత్తురు చిందించి పనిచేసిన చెల్లెలు షర్మిల.. ఆయన తనంత తానుగా తయారుచేసుకున్న శత్రువు. ఇప్పుడు ఆమె కూడా ప్రత్యర్థిగా మారి జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ ల మాటలను జనం పెద్దగా పట్టించుకోకపోవచ్చు గానీ.. షర్మిల మాటలను సీరియస్ గానే పరిగణిస్తారు కదా..! ఆమె జగన్ కు సంధిస్తున్న ప్రశ్నలు మాత్రం.. ప్రజలను ఆలోచింపజేసేవిగాను, జగన్ కు కంటిమీద కునుకు లేకుండా చేసేవిగానూ ఉంటున్నాయి. అందుకే ప్రజలు.. మీ చెల్లెలు షర్మిల ప్రశ్నలకు జవాబు చెప్పగలిగితే చాలు జగనన్నా.. నువ్వు ఎలక్షను కూడా గెలిచినట్టే అని జోకులు వేసుకుంటున్నారు.
తాజాగా వైఎస్ షర్మిల జగన్ కు ఒక లేఖాస్త్రం సంధించారు. ఈలేఖలో ఆమె పూర్తిగా రాజధాని మీదనే తన ఫోకస్ పెట్టారు. మాట తప్పిన జగన్ కు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని అంటూ.. ఆమె జగన్ కు ఓ సవాలు విసిరారు. ‘‘రాజధాని విషయంలో మాట తప్పానని మీకు అనిపిస్తే నాకు ఓటేయకండి- అని ప్రజలను అడిగే ధైర్యం మీకుందా’’ అని షర్మిల ప్రశ్నిస్తున్నారు. నవసందేహాలు పేరుతో ఒక్కొక్క సబ్జెక్టు మీద తొమ్మిదేసి ప్రశ్నలు సంధిస్తూ జగన్ కు వరుసగా లేఖలు రాస్తున్న షర్మిల తాజాగా పూర్తిగా రాజధాని గురించే లేఖలో ప్రస్తావించారు. మీ రాజధాని ఏది అని ఎవరైనా అడిగితే.. సమాధానం చెప్పలేని దుర్భర స్థితిలో ఏపీ ప్రజలనుఅయిదేళ్ల పాటు జగన్ అయోమయంలో ముంచేశారంటూ షర్మిల సూటిగా విమర్శించడం విశేషం.
ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఏదో స్పష్టంగా చెప్పండి? అనేది షర్మిల అన్నను అడుగుతున్న మొదటి ప్రశ్న. ఆ ఒక్క ప్రశ్నకు జగన్ సూటిగా సమాధానం చెప్పగలిగితే చాలు.. ఆయన రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్నట్టే. తప్పకుండా ఎన్నిక కూడా గెలిచినట్టే అనుకోవచ్చు. కానీ.. జగన్ తన జీవితంలో ఎన్నటికీ కూడా సమాధానం చెప్పలేని ప్రశ్న అది. ఇటీవలి ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో ఇంతకంటె సూటిగా రాజధాని గురించి ప్రశ్న ఎదురైతే.. అత్యంత డొంకతిరుగుడుగా ఎవ్వరికీ అర్థం కాని సమాధానం చెప్పిన వ్యక్తి జగన్. 2019ఎన్నికలకు ముందు.. రాజధానిగా అమరావతికి మద్దతు ఇస్తూ.. చంద్రబాబుకు ఇక్కడ ఇల్లు కూడా లేదు. నేను ఇల్లుకట్టుకున్నా అనే బూటకపు మాటలతో జగన్ వంచించిన తీరును కూడా షర్మిల ఎండగడుతున్నారు.
అమరావతిమీద మీకు ఎందుకంత కక్ష అంటూనే.. రైతుల మీద పగబట్టినట్టుగా వారి ఉద్యమాన్ని పోరాటాన్ని అణిచివేయడానికి ప్రయత్నించిన జగన్ దుర్మార్గాన్ని కూడా షర్మిల తన లేఖలో నిలదీశారు.
నిజానికి షర్మిల ఏపీసీసీ సారథిగా, కడప ఎంపీ అభ్యర్థిగా ఏ మేరకు విజయం సాధిస్తారోగానీ.. ఆమె తన లేఖల్లో సంధిస్తున్న ప్రశ్నలతో జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.