చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒకే ఒక్క సవాలు విసురుతున్నారు. అయితే ఆ సవాలు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ స్వీకరించలేనిది. స్వీకరించడానికి సాహసించలేనిది. జగన్ తన ఈగోను తగ్గించుకుని చంద్రబాబు సవాలు స్వీకరిస్తారనుకోవడం భ్రమ! ఆయన ఎప్పటికీ తన కోటరీ మనుషులు తన చుట్టూ సృష్టించే ఒక మాయా ప్రపంచంలోనే బతకడానికి ఇష్టపడతారనే ప్రజలు అనుకుంటున్నారు. అందుకే అబద్ధాలు చెప్పుకుంటూ.. ప్రజలు నమ్ముతారని భ్రమిస్తూ గడిపేస్తుంటారు.
జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో 9.74 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని చంద్రబాబు నాయుడు శాసనసభ సాక్షిగా వెల్లడించారు. అయితే తమ ప్రభుత్వం లో చేసినప్పుడు 7.48 లక్షల కోట్లు మాత్రమే అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చా.రు జగన్ చెబుతున్నట్లుగా 2.71 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఆయన పంపిణీ చేస్తే రాష్ట్రానికి 9.74 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయిందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్ కు ఉన్నదని చంద్రబాబు నాయుడు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఆర్థిక అరాచకం రాజ్యమేలిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి ఎలా ఉన్నప్పటికీ జగన్ అసెంబ్లీకి రావడం, అసెంబ్లీలో సమాధానం చెప్పడం.. అసలు జరుగుతుందా అని ప్రజల విస్తుపోతున్నారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని ఒక అతి చిన్న పార్టీ లాగా ఆ సభలో అడుగు పెట్టాలంటే.. జగన్ కు చాలా అవమానంగా ఉంది. అందుకే ఆయన సభకు రావడం లేదని అందరూ అనుకుంటున్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ప్రజలు ఆయనను నమ్మి 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. జగన్ చెప్పుకుంటున్నట్టుగా 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. ఆ 40 శాతం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం అంటే జగన్మోహన్ రెడ్డి సభకు రావాలి. సభలో తన గళం, తనకు ఓట్లు వేసిన ప్రజల గళం వినిపించాలి. లేకపోతే ఆయన ప్రజలను మోసం చేసినట్లే, వారిని చులకనగా చూసినట్లే అవుతుంది అని అందరూ భావిస్తున్నారు.