ప్రొఫెసర్ మాటలు వింటే జగన్ కోపగిస్తారేమో!

మనం నమ్మే అభిప్రాయాల ప్రకారం ఎదుటివారు నడుచుకోనప్పుడు.. వారు తప్పుడు మనుషులని మనకు అనిపిస్తుంది.. వారి మీద కోపం వస్తుంది! ఈ సిద్ధాంతం ప్రకారం చూస్తే తెలంగాణలో కొత్తగా ఎమ్మెల్సీ అయిన ప్రొఫెసర్ కోదండరాం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహుశా ఆగ్రహంతో ఊగిపోతూ ఉండాలి. ఎందుకంటే ఒకవైపు జగన్ ఏడాదికి 9 కోట్ల రూపాయల విలువైన భద్రతా వ్యవస్థ మధ్య ఉంటూ తనకు ఇంకా భద్రత కావాలని ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోర్టు ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో.. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాత్రం తనకు సెక్యూరిటీ సిబ్బంది వద్దే వద్దని తాను ప్రజల మనిషినని.. తాను ప్రజల మధ్యలో తిరుగుతూ ఉండడానికి సెక్యూరిటీ తనకు ఆటంకం అవుతుందని ప్రకటించడం గమనార్హం. ఒకవైపు ప్రొఫెసర్ సాబ్ అలాంటి ప్రమాణాలను రాజకీయ నాయకులకు నిర్దేశిస్తుంటే.. చుట్టూ వంద మంది పోలీసులను భద్రత కోసం పెట్టుకు తిరగడమే రాజకీయం అనుకునే జగన్మోహన్ రెడ్డికి కోపం రాకుండా ఎలా ఉంటుంది!

రాజకీయాలలో నాయకులకు భద్రత అవసరం. కానీ నిజమైన ప్రజా నాయకులు ప్రజల కోసం పనిచేసే వారు ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు లేకపోయినా తమ పని తాము చేసుకు పోతూనే ఉంటారు. రాజకీయంగా అధికారం.. ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా హోదా అంటే తమ డాంబికాన్ని ప్రదర్శించుకోవడానికి ఒక మార్గం అని భావించే వ్యక్తులు భిన్నంగా ఉంటారు. వారికి నిత్యం తమ వెంట గన్ మెన్ తిరుగుతూ ఉంటే అదొక తృప్తి. ఎంత  ఎక్కువ మంది గన్మెన్లు ఉంటే తాము అంత గొప్ప వారం అనే భ్రమలో వారు బతుకుతుంటారు. అందుకే చాలామంది నాయకులు తమకు భద్రత కుదించారని తమకు పెంచిన భద్రత కల్పించాలని కోర్టుల ద్వారా పిటిషన్లు నడుపుతూ తమలోని భయాన్ని తామే చాటుకుంటూ ఉంటారు. నిజంగా ప్రజల మనిషిగా చలామణి అయ్యే నాయకుడు అయితే వారికి భద్రత అవసరం ఏముంటుంది?

ఈ సిద్ధాంతానికి రుజువుగా నిలుస్తున్నారు ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమం సాగినప్పుడు సంయుక్త కార్యాచరణ సమితికి సారథ్యం వహించిన కోదండరాం- రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పూనికతో ఎమ్మెల్సీ అయ్యారు. తెలంగాణ కోసం పోరాడని కీర్తి తనకు తప్ప మరొకరికి దక్కకూడదనే స్వార్థంతో వ్యవహరించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదేళ్లపాటు కోదండరాం సేవలను గుర్తించకుండా విస్మరించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా కోదండరాం తాను ప్రజల కోసం పాటుపడే వ్యక్తినని, సమాజ హితం కోసమే పని చేసే వాడినని చేతలతో నిరూపించుకుంటున్నారు. కనీసం సెక్యూరిటీ కూడా వద్దని అనడం ద్వారా ఒక కొత్త ప్రమాణాలను నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వారిని చూసి వందల మంది సెక్యూరిటీ కావాలని కోరుకునే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు చాలా నేర్చుకోవాలని ప్రజల వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories