కడపకు ఆ ద్రోహం ఎందుకు చేశావు జగన్?

కడప- వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లా. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆ ప్రాంతంలో ఉన్న జనాదరణ కారణంగా అక్కడి ప్రజలు జగన్ ను కూడా నెత్తిన పెట్టుకుంటూ ఉంటారు. సాధారణంగా ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడు అయినా.. తన సొంత ప్రాంతానికి చెప్పలేనంత మేలు, అడ్డదారుల్లోనైనా చేస్తూ ఉంటారు. జగన్ కూడా అలాంటి మేలు ఏమైనా చేసే ఉంటారు. కానీ.. కడప జిల్లా యొక్క చారిత్రక ఆధ్యాత్మక ప్రాశస్త్యం, వైభవ ప్రతీకకు మాత్రం గండికొట్టారు. ఆ జిల్లా పేరులోంచి ‘కడప’ అనే పదాన్ని తొలగించేసి కేవలం వైఎస్సార్ అని పెట్టారు. ఆ ప్రాంత చారిత్రక వైభవానికి ఆ రకంగా జగన్ చేసిన ద్రోహం అది. జిల్లా పేరుకు సంబంధించి ఉన్న చరిత్రలోని హిందూ ఆధ్యాత్మిక విశేషాన్ని కూడా ఆ రకంగా జగన్ తొలగించారు. ఆయన చేసిన ద్రోహాన్ని సరిదిద్దేందుకు ఇప్పుడు ప్రయత్నం జరుగుతోంది. జిల్లా పేరును ప్రస్తుతం ఉన్న ‘వైఎస్ఆర్’ నుంచి ఇదివరకటిలాగా ‘వైఎస్ఆర్ కడప’ అని మార్పు చేయాలంటూ.. రాష్ట్రమంత్రి సత్యకుమార్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. ఆయన లేవనెత్తినది చాలా సహేతుకమైన కోరిక కావడంతో కొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

నిజానికి ముఖ్యమంత్రిగా ఉంటూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వైఎస్ఆర్ కు నివాళిగా సొంత జిల్లాకు ఆయన పేరు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కాదు. వైఎస్ఆర్ మరణానంతరం అప్పటి కాంగ్రెసు ప్రభుత్వమే ఆ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో దానికి ‘వైఎస్ఆర్ కడప జిల్లా’ అని పేరు పెట్టారు. ఆ పేరు చాలా గౌరవప్రదంగా కూడా ఉండేది.

కానీ జగన్ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తండ్రికోసం తాను కూడా ఏమైనా చేసినట్టుగా కనిపించాలని అనుకున్నారేమో తెలియదు. జిల్లా పేరులోంచి కడప అనే పదాన్ని తొలగించేశారు. కేవలం వైఎస్సార్ జిల్లాగా ఉంచారు. కానీ కడప అనే పదానికి చాలా చరిత్ర ఉంది. తిరుమల క్షేత్రాన్ని చేరుకోడానికి ఆ ప్రాంతం కడప వంటిది కావడంతో ఊరికి, జిల్లాకు కూడా కడప అనే పేరే స్థిరపడింది. జిల్లా పేరులో.. తిరుమల వైశిష్ట్యంతో ముడిపడిన ఆ చారిత్రక ప్రాశస్త్యాన్ని జగన్మోహన్ రెడ్డి తన చర్య ద్వారా తుడిచిపెట్టేశారు. అప్పట్లో కూడా ఈ పేరుపై చాలా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ప్రతి విషయంలోను మోనార్క్ లో వ్యవహరించే జగన్ వేటినీ పట్టించుకోలేదు. జిల్లా ప్రాశస్త్యానికి ఆ రకంగా జగన్ చేసిన ద్రోహాన్ని సరిదిద్దడానికి ఇప్పుడు మంత్రి సత్యకుమార్ చొరవ చూపిస్తున్నారు.

నిజానికి జగన్ దూకుడు జిల్లా పేరుకే పరిమితం కాలేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును అసంబద్ధంగా మార్చేసి.. దానికి వైఎస్సార్ పేరును జోడించారు ఆయన. నిజంగానే తండ్రి మీద అంత ప్రేమ ఉంటే.. అలాంటి వివాదం జోలికి వెళ్లకుండా.. కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో దేనికైనా వైఎస్ పేరు పెట్టి ఉండొచ్చు. కానీ.. అలాంటి వివాదానికి తెరతీశారు. తీరా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడగానే హెల్త్ యూనివర్సిటీ పేరునుంచి వైఎస్ఆర్ ను తొలగించి తిరిగి ఎన్టీఆర్ పేరుతో నామకరణం చేసింది. ఆ రకంగా తండ్రి పేరుకు అవమానం కలిగేలాగా జగన్ నిర్ణయాలు మారాయని సొంత పార్టీ వారే అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories