హఠాత్తుగా ‘అందరివాడు’ అయిపోయిన జగన్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణాతిదారుణంగా ఓడిపోవడం అనేది.. బహుశా ఆ పార్టీలోని ఎమ్మెల్యే స్థాయి గల కొందరు నాయకులకు ఒక రకమైన విచిత్రానందాన్ని కలిగిస్తూ ఉండవచ్చు. సొమ్ములు ఎటూ పోనాయి.. కనీసం ఆ రకమైన ఆనందం దక్కుతోందని వారు మురుస్తుండవచ్చు. ఇంతకూ ఆ ఆనందం ఏమిటో తెలుసా? ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే మాత్రమే అయిన జగన్మోహన్ రెడ్డి.. తమ వంటి నాయకులు వెళితే కలవడానికి అపాయింట్మెంట్ ఇస్తున్నారనేదే! అయిదేళ్లపాటూ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని కన్నూమిన్నూ గానకుండా అహంకారంతో ప్రవర్తించిన తమ పార్టీ అధ్యక్షుడు.. ఇప్పుడు కలవదలచుకున్నప్పుడు యాక్సెసిబుల్ గా ఉన్నారని వారు ఆనందిస్తున్నారు.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో.. ఎంపీలు, ఎమ్మెల్యేలు కాదు కదా.. కనీసం మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదని బాగా పేరొచ్చింది. ఒకరిద్దరు కాదు.. పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యేలు ఇదే సంగతి చెప్పారు. నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించడానికి కూడా తమకు అవకాశం దొరకడం లేదని పలు సందర్భాల్లో వాపోయారు. అపాయింట్మెంట్ దగ్గర మొదలైన గొడవే రఘురామక్రిష్ణ రాజు విషయంలో ఎన్నెన్ని మలుపులు తిరిగిందో కూడా అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు ఘోరంగా ఓడిపోయిన తర్వాత.. జగన్ హఠాత్తుగా అందరివాడుగా మారిపోయారు.

తొలిరోజు అసెంబ్లీలో ప్రమాణం చేసేసి నిమిషమైనా సభలో ఉండకుండా ఇంటికి పారిపోయిన జగన్.. మరురోజు అసెంబ్లీ వైపే చూడకుండా పులివెందులలో తేలారు. రెండు రోజులుగా ఆయన నియోజకవర్గ ప్రజలతో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం వరకు కూడా ప్రజాదర్బార్ జరుగుతందట. కడప జిల్లా, ఇరుగు పొరుగు  జిల్లాల్లోని అనేకమంది పార్టీ నాయకులు వచ్చి జగన్ ను కలుస్తున్నారు. అందరికీ అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయి. అందరితోనూ ముచ్చటపెడుతున్నారు. జగన్ పాలనలో పనులు చేసిన సొంత పార్టీ కాట్రాక్టర్లకు కూడా బిల్లుల చెల్లింపు జరగలేదు. జగన్ హయాంలో బిల్లుల చెల్లింపు అనేది సొంత పార్టీలోని కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితం అయిందని కూడా విమర్శలున్నాయి. అలాంటి వారందరూ కూడా వచ్చి జగన్ తో మొరపెట్టుకుంటూ ఉంటే ఆయన వారికి సర్ది చెప్పి పంపుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి అయిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండగా, బటన్లు నొక్కడానికి ఒక్కో ఊరిలో సభ పెట్టినప్పుడు.. పరదాలు కట్టుకుని, చెట్లను నరికి, దుకాణాలు మూయించి.. జనాలను ఆయన సమీపానికి కూడా రానివ్వనంత భద్రత మధ్య బతికారు. ఓడిపోయిన తర్వాత హఠాత్తుగా అందరివాడు అవతారం ఎత్తి.. ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా సభకు కూడా వెళ్లకుండా పులవెందుల ప్రజలకు ఏం చేయగలనని ఆయన ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారో తెలియదు గానీ, నాయకుడు యాక్సెసిబుల్ గా మారడం మంచి పరిణామం అని వైసీపీ నేతలు లోలోన ఆనందిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories