వినుకొండ పర్యటించిన సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారిగా పూనకం వచ్చేసింది. చేతిలో ఆయన కొన్ని కాగితాలు పట్టుకున్నారు. సినిమాల్లో సాక్ష్యాధారాల సహా కోర్టులో నేరాన్ని నిరూపించే లాయరు ప్రయత్నం లాగా ఆవేశపూరిత మాటలు రువ్వారు. బల్ల గుద్దడం అనే ప్రక్రియ జరగలేదు కానీ, అంతకంటే గట్టిగా తాను చెప్పదలుచుకున్న అబద్ధాలు ప్రజలందరూ నిజమని అనుకునేలాగా.. ఆ రకంగా రాష్ట్రం మొత్తాన్ని మరొకసారి భ్రమపెట్టేలాగా ఆయన ప్రకటించారు. అబద్ధాలు చెప్పే వారికే అంత గుండె ధైర్యం ఉంటే, నిజం చెప్పే వారికి ఇంకెంత ధైర్యం ఉండాలి. దానికి తగ్గట్టుగానే అబద్ధాలను వండి వార్చిన జగన్ ప్రయత్నం సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా అయింది.
రషీద్ హత్య విషయంలో పాత కక్షలకు సంబంధించి మీడియాలో కథనాలు వస్తే జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా మసిపూసి మారేడు కాయ చేస్తూ కొన్ని నెలల కిందట జరిగిన మరొక కొత్త ఘర్షణ తాలూకు కేసు పేపర్లను పట్టుకుని మాయ చేసారు. జిలానికి రషీద్ కు మధ్య పాత కక్షలు ఉన్నాయని, ఏడాది కిందట కొట్టుకున్నారని జిలానీకి చెందిన బుల్లెట్ మోటార్ సైకిల్ ను రషీద్ దగ్ధం చేసేసారని మీడియాలో కథనాలు వచ్చాయి.
అయితే నిరంతరం పచ్చ మీడియా అంటూ పారాయణం చేస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి వారి కథనాలను అభూత కల్పనలుగా కొట్టి పారేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన మరొక ఘర్షణలకు సంబంధించిన కేసు పేపర్లను ఆయన పట్టుకొచ్చారు. దగ్ధమైన మోటారు సైకిలు తమ పార్టీ వారిది అని అన్నారు. ఆయన చెప్పినట్లుగానే మోటార్ సైకిల్ ఆసిఫ్ అనే వ్యక్తిది. దానిని తగలబెట్టిన వ్యవహారానికి సంబంధించి తెదేపాకు చెందిన కార్యకర్తల మీద ఈ ఏడాది జనవరి 17న పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ అదొక్కటే కాదు అదే రోజు జరిగిన ఘర్షణలకు సంబంధించి తెలుగుదేశం నాయకులు పెట్టిన మరో కేసును వైసీపీ నాయకుల మీద కూడా నమోదు చేశారు.
అశ్వద్ధామ హతః కుంజరః అన్నట్టుగా ఈ విషయంలో అర్థసత్యాలను మాత్రం మాట్లాడి ప్రజలను మోసం చేయడానికి జగన్ ప్రయత్నించారు. ఈ మోసమంతా కూడా కేవలం ఈ ఏడాది జనవరిలో జరిగిన ఘర్షణలకు సంబంధించి మాత్రమే. అయితే రషీద్ హత్యకు ప్రమేయం ఉన్నది గత ఏడాది జరిగిన మరో ఘర్షణల పర్యవసానం అనేది అందరూ చెబుతున్న సంగతి. అప్పట్లో జిలాని- రషీద్ గొడవ పడిన తర్వాత రషీద్ వెళ్లి వారి ఇంటి మీద దాడి చేసి ఆ సమయంలో జిలానీ ఇంట్లో లేకపోవడంతో అతని తమ్ముడు జిమ్ జానీ తల పగలగొట్టి, అతని బుల్లెట్ బండికి నిప్పు పెట్టాడు. దీనిని జగన్ తనకు కావలసినట్టుగా మలిచి, వేరే కేసు పేపర్లను పట్టుకొచ్చి రకరకాల అబద్ధాలతో బుకాయిస్తూ… రషీదు మహానుభావుడని చెప్పే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా పాత కక్షలు గురించిన వాస్తవాలు వెల్లడించిన మీడియా అందరి మీద కూడా బురద చల్లడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం సెల్ఫ్ గోల్ అయింది. ప్రజలు ఎన్నికల్లో ఇంత దారుణంగా బుద్ధి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంకా జ్ఞానోదయం కలగలేదని, అబద్ధాలు మానుకోలేదని అందరూ అనుకుంటున్నారు.