జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన అయిదేళ్లు పదవీకాలంలో మంత్రులుగా కేబినెట్ లో పనిచేసిన వారి మీద చాలా జోకులు ఉన్నాయి. వారందరూ పేరుకు మంత్రులే గానీ.. తమ తమ శాఖలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం కాదు కదా.. కనీసం ప్రెస్ మీట్ పెట్టి సొంతంగా తమకు తోచిన నాలుగు మాటలు మాట్లాడే హక్కు కూడా వారికి లేదని అంతర్గత వ్యవహారాలు తెలిసిన వారు అంటుంటారు! వారు చంద్రబాబును తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టాలన్నా సరే.. స్క్రిప్టు తాడేపల్లి నుంచి రావాల్సిందేనని విమర్శలున్నాయి.
మంత్రుల సంగతి ఇలా ఉంటే డిప్యూటీ ముఖ్యమంత్రుల సంగతి ఇంకా ఘోరం. పేరుకు తాను డిప్యూటీ ముఖ్యమంత్రినే గానీ.. తన సొంత నియోజకవర్గంలో ఒక ఎమ్మార్వోతో ఒక పనిచేయించుకునే స్వతంత్రం కూడా తనకు లేదని.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారో లెక్కేలేదు. రెడ్ల వద్ద తట్టుకుని బతకలేకపోతున్నానంటూ ఆయన పలుమార్లు నియోజకవర్గంలో బాధపడ్డారు. అలాంటి పసలేని డిప్యూటీసీఎం పదవి వస్తే ఎంత? రాకపోతే ఎంత? అనేది ప్రజలకు తెలుసు. అందుకే వారు జగన్.. తాను ప్రజలకు పెద్ద వరం ప్రకటించినట్టుగా.. మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ‘డిప్యూటీ ముఖ్యమంత్రి’ ని చేస్తా అంటే.. జనం నవ్వుకుంటున్నారు తప్ప.. స్పందించడం లేదు.
పిఠాపురం నియోజకవర్గంలో జగన్.. ఎంపీ వంగా గీతను పవన్ కల్యాణ్ మీద పోటీకి మోహరించారు. తన మాటలు పిఠాపురం ప్రజలను టోకుగా ప్రభావితం చేసేలా ఉండాలనే ఉద్దేశంతో చివరి రోజు ప్రచారం షెడ్యూలులో పిఠాపురం పెట్టుకున్నారు. అక్కడ సభలో జగన్ మాట్లాడుతూ.. పవన్ ను ఓడించి, వంగా గీతను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గనుక.. ఆమెను డిప్యూటీ ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. అదేదో నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకలబ్ధి పథకం ప్రకటించినంత ఆర్భాటంగా ఆ విషయం చెప్పారు. పిఠాపురం నియోజకవర్గానికి నిర్దిష్టంగా ఏం మేలు చేస్తున్నావు? ప్రజలకు కొత్తగా ఏం హామీలు ఇచ్చావు అనేది లేకుండా.. డిప్యూటీసీఎం చేయడం యూజ్ లెస్ అని ప్రజలు పెదవి విరుస్తున్నారు. గతంలో ఇలాంటి మాటలు జగన్ చాలాచాలా చెప్పారని అయితే ఇలాంటి హామీలను నిలబెట్టుకునే అలవాటు ఆయనకు లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.