దళితుడిని కిడ్నాప్ చేసి, నిర్బంధించిన కేసులో అరెస్టు అయి జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి మాత్రమే వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర సమయం ఉంది. అంతే తప్ప వాస్తవానికి మిర్చి రైతుల గోడు వినడానికి ఆయన వద్ద ఖాళీ లేదు. కానీ, హఠాత్తుగా ఆ ఖాళీని సృష్టించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోఉన్న నేపథ్యంలో మిర్చి యార్డు వద్ద కార్యక్రమం నిర్వహించవద్దని పోలీసులు వారించినప్పుడు జగన్ సంతోషంగానే ఫీలయ్యారు. ఆ సాకు మీద మిర్చి రైతుల వద్దకు వెళ్లడానికి కొన్ని రోజులు వాయిదా వేయవచ్చునని ఆయన అనుకున్నారు. కార్యక్రమం వాయిదా పడ్డట్లు పార్టీ శ్రేణులకు తొలుత సమాచారం పంపారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్న తీరు గమనించిన తర్వాత జగన్ తన ఆలోచన మార్చుకొని హడావుడిగా మిర్చి యార్డ్ పర్యటన పెట్టుకున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
కేంద్రానికి డిసెంబర్లో రెండుసార్లు తాజాగా మరొకసారి లేఖ రాసిన చంద్రబాబు నాయుడు సర్కారు మిర్చి రైతులు ఆశించే దానికంటే ఎక్కువగా వారికి సాయం అందించేందుకు ఆలోచన చేసింది. ప్రతి విషయంలోనూ చంద్రబాబు ప్రతిపాదనలకు, లేఖలకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తున్న తరుణంలో మిర్చి రైతుల విషయంలో కూడా త్వరలోనే కేంద్ర సాయం ప్రకటన వస్తుందని జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందారు. నిజానికి మిర్చి రైతుల ఇబ్బందుల గురించి రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల కిందటే డిసెంబర్లోనే అప్రమత్తమైంది. కేంద్రానికి రెండు లేఖలు కూడా అప్పుడే రాసింది. అయితే జగన్ మాత్రం ఇప్పుడే మేలుకున్నారు. పరామర్శ కార్యక్రమాన్ని ఇంకా వాయిదా వేస్తే ఆలోగా కేంద్ర సాయం కూడా వచ్చేస్తుంది అని భయపడ్డారు. తనకు రాజకీయ మైలేజీ దక్కదని ఆందోళన చెందారు. అందుకే హడావుడిగా మిర్చి యార్డు పర్యటన పెట్టుకున్నారు.. అని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ యాత్రలో ఉన్నారు. కేంద్ర మంత్రులతోనూ, కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి తోను సమావేశం కాబోతున్నారు. మిర్చి రైతులకు అందించవలసిన సాయం గురించి చర్చించబోతున్నారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ కంటే ముందే పరామర్శకు వెళ్లడం అవసరం అని జగన్ భావించారని తెలుస్తోంది.
రేపు కేంద్రం నుంచి మిర్చి రైతుల కోసం సానుకూల ప్రకటన వస్తే గనుక- ‘అది కేవలం తన పుణ్యమే’ అని.. తాను రైతులను పరామర్శించిన సమచయంలో అక్కడి రైతులు తన పట్ల చూపించిన ప్రేమ, ఆదరణ చూసి జడుసుకుని చంద్రబాబు కేంద్ర సాయం తీసుకువచ్చారని సొంత డప్పు కొట్టుకోవడానికి వీలుగా ఉంటుందని మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఈ కుట్ర మార్గం అనుసరించినట్లుగా తెలుస్తోంది. అయితే జగన్ ప్రదర్శించే ఈ టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలకు ప్రజలు మోసపోవడం ఎన్నడో ముగిసిపోయింది. ఇప్పుడు అంత ఈజీగా బట్టలో పడే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.