సతీ సావిత్రి నాటకం మీకు గుర్తుందా? సావిత్రి పాపం తన భర్తను బతికించుకోవడానికి నానాపాట్లు పడుతుంటుంది. యముడి వెంటపడుతుంది. ఆమె ఆవేదనను యముడు కూడా అర్థం చేసుకుంటాడు. ఆమెకు వరాలు ప్రసాదించడానికి పూనుకుంటాడు. కానీ ప్రతిసారి వరం కోరుకోమని ఒక వైపు చెబుతూనే మరొకవైపు ‘‘నీ పతి ప్రాణముల తప్ప’’ అంటూ కండిషన్ పెడతాడు. యముడు ఆ రకంగా తన జాగ్రత్తలో తానుంటాడు. కానీ సావిత్రి తెలివైనది గనుక ఎలాగో ఒకలాగా యముడిని బురిడీ కొట్టించి మొత్తానికి తన ప్రతి ప్రాణాలను రక్షించుకుంటుంది. ఇది మనకు తెలిసిన పురాణ కథ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కూడా ఈ కథను గుర్తు చేసే లాగా ఉంటోంది. రాజకీయ పార్టీల మధ్య సవాళ్లు- ప్రతి సవాళ్లు ఉండడం సహజం. అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉన్నదంటే మీరు ఎలాంటి సవాళ్లయినా విసరండి. అన్నింటికీ కౌంటర్లు వేస్తాం కానీ ఒక్క సవాలు మాత్రం అడగొద్దు. ఎందుకంటే దానికి మా దగ్గర జవాబు లేదు.. అన్నట్టుగా ఉంది. ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే తరహాలో వారు సాగుతున్నారు.
వినుకొండలో వ్యక్తిగత కక్షల పర్యవసానంగా జరిగిన హత్యను, ఢిల్లీలో ధర్నా చేయడానికి వాడుకుంటున్న జగన్ వైఖరిని చూసి ఆయన మానసిక పరిస్థితి పై అనుమానం కలుగుతోందని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. ప్రజలు ఎంతగా చీదరించుకున్నప్పటికీ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర చేసిన సవాలు మాత్రం గమనించదగినది.
‘‘మీకు దమ్ముంటే అసెంబ్లీకి రండి అక్కడ అన్ని విషయాలు బహిరంగంగా కూలంకషంగా చర్చించుకుందాం’’ అని కొల్లు రవీంద్ర అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం అసెంబ్లీ బీభత్సస్థాయిలో ఉన్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే. అసెంబ్లీకి వెళ్లకుండా ఎలాంటి కుంటిసాకులు చెప్పాలా అని జగన్ వెతుక్కుంటూ ఉన్నారు. కేవలం అసెంబ్లీని ఎగ్గొట్టడానికే వినుకొండ అంశాన్ని వాడుకుంటున్నారనేది కొల్లు రవీంద్ర ఆరోపణ కూడా!
అందుకే అసెంబ్లీకి రండి తేల్చుకుందాం అని రవీంద్ర అంటుంటే ‘ఆ ఒక్కటి అడక్కు’ అని జగన్మోహన్ రెడ్డి తప్పించుకోజూస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. 11 మంది సభ్యులతో అసెంబ్లీలో కూర్చోవడం అంటే జగన్ కు చాలా అవమానంగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఆయన నెమ్మదిగా తేరుకుని పరిస్థితులకు సర్దుకుని తన పార్టీని నమ్మి 11చోట్ల గెలిపించిన ప్రజల నమ్మకానికి విలువ ఇస్తూ అసెంబ్లీకి హాజరు కావాలని ప్రజలు అంటున్నారు.