వైఎస్ జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా సంఘసంస్కర్త, ప్రవచనకర్త అవతారం ఎత్తారు. 2024 లో రాష్ట్రప్రజలు కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ వారంలో నాలుగైదు రోజులు బెంగుళూరు ప్యాలెస్ లో సేదతీరుతూ గడుపుతున్న జగన్మోహన్ రెడ్డికి.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో తాను నిర్మించుకున్న బూటకపు కోటగోడలు ఒక్కసారిగా ప్రజాస్వామ్యం తాకిడికి నేలమట్టం అవుతుండడంచూసి మరోసారి మైండ్ బ్లాంక్ అయినట్టుంది. ఈ కష్టాల్లో ఆయనకు తత్వం బోధపడినట్టుంది. రాష్ట్రంలో అసలు రాజ్యాంగం అమలు కావడం లేదని, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని చంపేస్తే ప్రజల్లోంచి తిరుగుబాటు మొదలై నక్సలిజం పుడుతుందని జగన్మోహన్ రెడ్డి జోస్యం చెబుతున్నారు. బహుశా కార్ల్ మార్క్స్ వంటి కమ్యూనిజం సిద్ధాంతకర్తలు కూడా నక్సలిజం పుట్టుక గురించి ఇంత స్పష్టమైన నిర్వచనం చెప్పగలిగేవారు కాదేమో.
అయినా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. సమాధానం చెప్పాల్సిన విషయం మరొకటి ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ తదితరులు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని దందా చేసేట్లయితే.. ఇతర పార్టీలవాళ్లు ఇండిపెండెంట్లు అసలు నామినేషన్లు వేయకుండానే అడ్డుకునే వాళ్లం కదా అని అంటున్నారు. వైసీపీ జమానా సాగినంత కాలమూ.. పులివెందులలో నామినేషన్ వేయడానికి కూడా ధైర్యం చాలలేదు.. ఇప్పుడు ఏకంగా 11 మంది నామినేషన్లు వేశారంటే.. దాని అర్థం ప్రజాస్వామ్యం అక్కడ పరిఢవిల్లుతున్నట్టే కదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి ముందు జగన్ జవాబు చెప్పాలి.
అలాగే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయో కూడా జగన్ గుర్తుచేసుకోవాలి. అప్పట్లో తెలుగుదేశం, జనసేనకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వస్తే.. వారిని కొట్టి కొట్టి తరిమారు. కొన్నిచోట్ల నామినేషన్ల గడువు పూర్తయ్యేవరకు వారిని పోలీసులతో నిర్బంధింపజేశారు. ఆతర్వాత విడిచిపెట్టారు. తద్వారా.. అనేక చోట్ల ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా చూసుకున్నారు. కొన్ని చోట్ల అయితే.. ఇన్ని ప్రతిబంధకాలను దాటుకుని తెలుగుదేశం, జనసేన, బిజెపికి చెందిన వారు ఒక చిన్న స్థానిక సంస్థల ఎన్నికలో గెలిస్తే.. వారికి బలవంతంగా తమ పార్టీ కండువా కప్పేసి తమ పార్టీ గెలిచినట్టుగా ప్రచారం చేసుకున్నారు. బెదిరించారు.. లోబరచుకున్నారు. ఇన్ని దారుణాలు ఈ ఎన్నికల్లో జరగలేదు. అప్పట్లో జగన్ ప్రజాస్వామ్యాన్ని తన ఇనుపపాదాల కింద తొక్కిపారేశారు. రాజ్యాంగాన్ని కాలరాచారు.
అలాంటి పరిణామాలు జరిగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని జగన్ చెబుతున్న మాట నిజమే. అలా తిరుగుబాటు వచ్చింది గనుకనే.. 2024 ఎన్నికల్లో జగన్ అత్యంత నీచంగా ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. ఆయన అజ్ఞానం ఏ రేంజిలో ఉన్నదంటే.. ప్రజల్లో తిరుగుబాటు వస్తే నక్సలిజం పుడుతుందన్నది ఆయన భ్రమ. ప్రజల్లో తెలివి పెరిగింది. తిరుగుబాటు వస్తే వారు ప్రజాస్వామ్య యుతంగానే.. ఆ తర్వాతి ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెబుతారు అని ఆయన కనీసం తన స్వానుభవం నుంచి కూడా గ్రహించడం లేదు. వాస్తవాలను గ్రహించకుండా.. చంద్రబాబుకు వ్యతిరేకంగా నక్సలిజం పుడుతుందనే పసలేని మాటలతో జగన్ తనను తాను నవ్వులపాలు చేసుకుంటున్నారు.