గూగులమ్మను కెలికి అజ్ఞానం చాటుకుంటున్న జగన్!

చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఒక్కటొక్కటిగా కొత్త ప్రాజెక్టులు చేపడుతుండడం.. వివిధ రంగాల్లో ఒక్కొక్క అడుగూ ముందుకేస్తుండడం చూసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నట్టుగా ఉన్నారు. విజయవాడ- శ్రీశైలం నడుమ సీప్లేన్ ను చంద్రబాబునాయుడు ప్రారంభించడం, దీని పట్ల ప్రజలనుంచి అభినందనలు వస్తుండడం  చూసి జగన్మోహన్ రెడ్డి సహించలేకపోతున్నారు. దేశంలో ప్రస్తుతానికి నడుస్తున్న మొదటి సీప్లేన్ ప్రాజెక్టు ఇదే అని ప్రభుత్వం చెబుతుండగా.. జగన్మోహన్ రెడ్డి లెక్కలు తీస్తున్నారు.
సీప్లేన్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ నడిచిందో గూగుల్ ను అడిగితే చెబుతుంది. 114 ఏళ్ల కిందట 1910లో మొదటిసారిగా నడిచిందని, 2013లో మనదేశంలో మొదటిసారిగా కేరళలో నడిచిందని, గుజరాత్ లో 2020లో సర్వీసులు నడపడం మొదలెట్టినా కంటిన్యూ కాలేదని.. గూగుల్ ద్వారా సంపాదించిన జ్ఞానం మొత్తం ఎక్స్ ఖాతాలో పంచిపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రతి రాష్ట్రంలో అనేక రిజర్వాయర్లు డ్యామ్ లు ఉన్నాయి. మరి ఎందుకు ఆయా రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయోగాలు కొనసాగడం లేదు.. అని జగన్మోహన్ రెడ్డి అజ్ఞానం కొద్దీ ప్రశ్నిస్తున్నారు.

జగన్ తెలుసుకోవాల్సిన  ముచ్చట ఒకటుంది. ఏదో ఒక రాష్ట్రంలో రెండు రిజర్వాయర్లు ఉంటే అక్కడ సీప్లేన్ నడిపేయొచ్చు కదా అనుకునేది ఆయన అజ్ఞానం. ఆ రెండు చివర్లలోనూ రెండు ప్రముఖ పర్యాటక స్థలాలో.. పుణ్యక్షేత్రాలో ఉండాలి. జగన్ ఇలాంటి చవకబారు విమర్శలతో ఎక్స్ ఖాతాలో బురద చల్లేముందు.. కేరళలో, గుజరాత్ లో ఈ ప్రాజెక్టులు ఎక్కడ నడిచాయో, ఎందుకు ఆగిపోయాయో కూడా గూగుల్ ను అడిగి ఉంటే బాగుండేది. ఆయన జ్ఞానం కాస్త వికసించేది.

2013లో కేరళ తొలి సీప్లేన్ ప్రయోగం చేసిన మాట నిజమే. కానీ వాతావరణం ప్రతికూలంగా ఉన్న కారణంగా.. తొలిరోజే విజయవంతం కాలేదు. నిత్యం వర్షాలు కురుస్తూ ఉండే కేరళలో వాతావరణం అంతగా అనుకూలించడం తక్కువ గనుక ఆ ప్రాజెక్టు అటకెక్కింది. గుజరాత్ లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఏపీ సంగతి అలా కాదు.  ఇక్కడ విజయవాడ- శ్రీశైలం రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాల నడుమ సీప్లేన్ నడుస్తున్నది. తక్కువ సమయంలోనే రెండు పుణ్యక్షేత్రాల్లోనూ దర్శనాలు పూర్తిచేసుకో వాలనుకునే  సంపన్న భక్తులకు ఇది ఎంతో సౌకర్యం. కేవలం విహారయాత్రగా మాత్రమే అయితే.. కొంతకాలానికి ఆదరణ తగ్గవచ్చు. ఇది అలాకాదు. రెండు పుణ్యక్షేత్రాల నడుమ కావడంతో.. ఎన్నారై తెలుగువారు.. ఇలా వేగంగా దర్శనాలు చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ సేవలను వాడుకుంటారు.

ఈ వాస్తవాలేం తెలుసుకోకుండా, ఆలోచించకుండా.. కేవలం అక్కడా  ఇక్కడా ఫెయిలయ్యాయంటూ ఏపీలో తలపెట్టిన ప్రాజెక్టుకు శకునాలు పలుకుతుండడం జగన్మోహన్ రెడ్డి అజ్ఞానాన్ని మాత్రమే కాదు, సంకుచిత బుద్ధిని కూడా నిరూపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories