తన మీద ఉన్న సీబీఐ కేసుల్లో అరెస్టు కావడం గ్యారంటీ అని జగన్మోహన్ రెడ్డికి సమాచారం అందింది. అలాగే వివేకా హత్య కేసు కూడా త్వరలోనే ఒక కొలిక్కి రానున్నదని, తన తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడడం ఇక తన వల్ల కాని పని అని కూడా ఆయనకు అర్థమైపోయింది. అందుకే ఈ సమయంలో బిజెపితో తగాదాపెట్టుకుంటే.. రేపు తమ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా సరే.. రాజకీయ ప్రేరేపితంగా కక్షసాధింపుకోసమే అరెస్టులు చేసినట్టుగా ఆక్రోశించవచ్చు అనేది జగన్ ప్లాన్. అందుకోసమే ఆయనకు సంబంధం లేని విషయం అయినప్పటికీ.. హర్యానా ఎన్నికల ఫలితాల గురించి ట్వీట్ చేయడం ద్వారా.. అందరి దృష్టిని ఆకర్షించేందుకు జగన్ తాపత్రయ పడుతున్నారని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా ఉంది. కేవలం ఎన్నికల్లో దక్కిన పరాజయం మాత్రమే కాదు. అంతకుమించిన ఇబ్బందులు ఆయనను చుట్టుముట్టనున్నాయి. వాటిలో ఆయన మీద ఉన్న సీబీఐ కేసులు, అక్రమార్జనలకు సంబంధించిన ఈడీ కేసులు ప్రధానమైనవి. అలాగే ఆయన తన ప్రియమైన తమ్ముడిగా చెప్పుకునే వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఉన్న బాబాయి వివేకా హత్య కేసు కూడా తెరమీదకు రానుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటూ ఇన్నాళ్లూ ఈ కేసులు ఒక కొలిక్కి రాకుండా, ఏ సంగతీ తేలకుండా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటూ మనగలిగారు. కేంద్రంలోని సర్కారు ఎదుట సాగిలపడుతూ.. తనను తాను కేసులనుంచి కాపాడుకుంటూ వచ్చారు. ఆయన ఎప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లినా.. ప్రత్యేకహోదా, రైల్వేజోన్, పోలవరం గురించి అడిగాను అనే ప్రకటన వచ్చేది తప్ప.. ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టిన పాపాన పోలేదు. నిజానికి కేవలం తన కేసుల గురించి తప్ప ఆయన ప్రధానిని, హోం మంత్రిని వేరే అడిగేవారు కాదనే విమర్శలు ఉన్నాయి. రాజ్యసభలో భాజపా సర్కారుకు ఓట్ల అవసరం వచ్చినప్పుడు జగన్ సహకరిస్తూ వచ్చారు. క్విడ్ ప్రోకో లాగా అందుకు ప్రతిగా తనను కేసుల నుంచి కాపాడుకున్నారనే విమర్శలున్నాయి.
కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రాజ్యసభలో నిజానికి కేంద్రానికి మద్దతివ్వగల స్థాయి బలం కూడా జగన్ కు లేకుండా పోయింది. చాలా మంది రాజీనామాలు చేసేశారు. ఆయనమీద కేసుల విషయంలో చంద్రబాబు అండ్ కో గట్టిగా పట్టుబిగించే అవకాశం ఉంది. ఈ కేసులు త్వరలోనే తుదిదశకు వస్తాయని సమాచారం.
జగన్ వ్యూహం ఏంటంటే.. ఇప్పుడు బిజెపితో వైరం పెట్టుకుంటే గనుక.. కేసుల్లో తనకు శిక్ష పడితే.. రాజకీయంగా వేధించడానికే శిక్షలు వేయించారు అని చెప్పుకుంటూ సానుభూతి కోసం ప్రయత్నించవచ్చు. ఆ వ్యూహంతోనే ఆయన తనకు సంబంధం లేని హర్యానా ఎన్నికలను, ఎపీ ఫలితాలతో పోలుస్తూ.. బిజెపి ఈవీఎంలలో అక్రమాలకు పాల్పడిందని అర్థం వచ్చేలా ట్వీట్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తనకు శిక్షలు పడితే.. అది బిజెపి తన మీద కక్ష కట్టడం వల్ల అని చెప్పుకోడానికి ఆయన తాపత్రయ పడుతున్నట్టుగా కనిపిస్తోంది. మరి జగన్ ఇలాంటి వక్రవ్యూహం ద్వారా ఏం సాధిస్తారో చూడాలి.