శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని 11 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టుగా తాజాగా వార్తలు వస్తున్నాయి. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతుండగా.. తొలిరోజు జరిగే గవర్నర్ ప్రసంగానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు హాజరు అయ్యేలా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నుంచి సభకు హాజరవుతారా లేదా ఇంకా నిర్ణయించుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి 60 రోజుల పాటు సభకు సెలవు పెట్టకుండా గైర్హాజరయ్యే సభ్యుడిని ఆటోమేటిగ్గా అనర్హుడిగా ప్రకటించవచ్చుననే రాజ్యాంగ నిబంధనను డిప్యూటీ స్పీకరు రఝఘురామక్రిష్ణరాజు తెరపైకి తెచ్చిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డిలో వణుకు మొదలైందని, ఇన్నాళ్లూ మేకపోతు గాంభీర్యంతో రకరకాల మాటలు పలికినప్పటికీ.. మొత్తానికి అనేక మెట్లు దిగి సభకు తమ పార్టీ వారు హాజరు కావడానికి నిర్ణయించారని తెలుస్తోంది.
ప్రజలు 151 సీట్ల అపూర్వమైన విజయాన్ని కట్టబెట్టారని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి అయిదేళ్లపాటూ కన్నూమిన్నూ గానని పరిపాలన సాగించారు. 2024 ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్లపాటూ నిరంతరాయంగా తానే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా ఆయన కలగన్నారు. ఆ విషయాన్ని ఎన్నికల ప్రచారంలో కూడా చాటుకున్నారు. ముప్పయ్యేళ్ల పాటు జగన్ బెడద తప్పదేమో అని భయపడిన ప్రజలు ఆయనను ఎంత దారుణంగా ఓడించారంటే.. కేవలం 11 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కనీసం మొత్తం శాసనసభ్యుల్లో పదిశాతం సీట్లు కూడా దక్కలేదు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అయితే.. ఎంతో అసమంజసమైన రీతిలో.. తనకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇస్తే తప్ప శాసనసభకు రాబోను అంటూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. భీష్మించుకుని కోర్టులో ఒక కేసు వేసి.. ఇప్పటిదాకా అసెంబ్లీకి హాజరుకాకుండా ఉండిపోయారు. తనకు హోదా రాలేదని అలిగి.. తన పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లకుండా ఉండే పరిస్థితి కల్పించారు.
కాగా.. 60 రోజుల పాటు ఒక ఎమ్మెల్యే సభకు రాకపోతే, అందుకు సంబంధించి సహేతుకమైన కారణంతో సెలవుచీటీకూడా పంపకపోతే.. అతడిని ఆటోమేటిగ్గా అనర్హుడిగా ప్రకటించవచ్చుననే రాజ్యాంగ నిబంధనను ఇటీవల డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణరాజు ప్రస్తావించారు. జగన్ పోస్టు ఖాళీ అవుతుందని, పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని విలేకర్లు జగన్ వద్ద ప్రస్తావించినప్పుడు, హోదా ఇచ్చేదాకా సభకు వెళ్లేది లేదని, దమ్ముంటే ఏం చేస్తారో చేసుకోండి అని ప్రగల్భాలు పలికారు. తీరా సోమవారం నుంచి మొదలు కాబోతున్న శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని పార్టీ నిర్ణయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. తొలిరోజు మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యేలా నిర్ణయం జరిగింది. మంగళవారం జగన్ హాజరు అవుతారని సమాచారం. కత్తివేటు పడుతుందనే సరికి జడిసి.. జగన్ తన అహంకారాన్ని పక్కన పెట్టినట్టుగా కనిపిస్తోంది.