ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆదాయం ఉండే తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎగ్జిక్యూటవ్ అధికారిని నియమించే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అనుచితమైన అవ్యాజమైన ప్రేమానురాగాలను చూపిస్తున్నారు. ఇప్పటికే టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఒక నాన్-ఐఏఎస్ అధికారిని ఆ పోస్టులో నియమించిన జగన్.. కేంద్ర సర్వీసులనుంచి ఆయన డిప్యుటేషన్ ముగస్తుండగా.. ఆయన రిటైరయ్యేదాకా అక్కడే కొనసాగించాలంటూ పనిగట్టుకుని ప్రత్యేకంగా కేంద్ర డిఫెన్స్ శాఖకు ఉత్తరం రాయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డిని అడ్డుపెట్టుకుని.. జగన్ అనేకానేక దందాలు సాగిస్తూ వచ్చారని, వాటన్నింటినీ కనీసం మరికొన్ని వారాలు కొనసాగించడానికే ఈ లేఖరాశారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఈవో ధర్మారెడ్డిపై జగన్ కనబరుస్తున్న అతిప్రేమను గమనిస్తోంటే టీటీడీ నిధుల భద్రతపై కూడా అనుమానాలు కలుగుతున్నాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
టీటీడీ ఈవోగా ప్రస్తుతం ధర్మారెడ్డి ఉన్నారు. ఆయన నిజానికి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సరర్వీస్ (ఐడీఈఎస్) నుంచి వచ్చారు. రాష్ట్రసర్వీసులోకి ఆయన డెప్యుటేషన్ రెండేళ్ల కిందటే ముగిసింది. అయితే జగన్ ప్రత్యేకంగా కేంద్రానికి ఉత్తరం రాసి రెండేళ్పపాటు పొడిగింపజేసుకున్నారు. ఈ ఏడాది మే 14న ఆ డిప్యుటేషన్ కూడా ముగుస్తుంది. ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లాలి. జూన్ 30న ఆయన పదవీవిరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయనను రిటైర్ అయ్యేదాకా టీటీడీ ఈవోగానే కొనసాగడానికి అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ కేంద్ర డిఫెన్స్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు ఒక ఉత్తరం రాశారు.
ధర్మారెడ్డి మాత్రమే కావాలనడానికి జగన్ చెప్పిన కారణాలు చాలా చిత్రంగా ఉన్నాయి. వేసవి కారణంగా తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆయన మాత్రమే రద్దీని సమర్థంగా నిర్వహించగలరని, ఆయన లేకపోతే మరొకరు ఆ పని చేయలేరని జగన్ లేఖలో రాయడం తమాషాగా ఉంది. సాధారణంగా వ్యవస్థలు గొప్పవి.. వ్యక్తులు ఎవ్వరు ఆ పదవుల్లోకి వచ్చినా సరే.. వ్యవస్థ పద్ధతులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. సారథ్యం వహించే వ్యక్తులు ఎవ్వరైనా సరే.. వ్యవస్థలు ఒకేతీరుగా పనిచేస్తూ పోవాలి. కానీ.. జగన్ తీరు ఎలా ఉన్నదంటే.. ఈవోగా ధర్మారెడ్డి లేకపోతే.. అసలు టీటీడీ మొత్తం స్తంభించిపోతుంది అన్నట్టుగా ఉంది.
పైగా ఎన్నికల నేపథ్యంలో పలువురు ఐఏఎస్ లను ఎన్నికల పరిశీలకులుగా నియమించారట. కాబట్టి టీటీడీ ఈవోగా నియమించడానికి ఇప్పుడు ఐఏఎస్ లు ఎవరూ దొరకడట. జూన్ నెలాఖరు వరకు ఐఏఎస్ లు దొరకరని కూడా జగన్ ఆ లేఖలో రాశారు. జూన్ 4 తర్వాత అసలు జగన్ ఉంటారో లేదో గ్యారంటీ లేనప్పుడు.. జూన్ నెలాఖరు దాకా ఐఏఎస్ లను ఇవ్వలేం అని జగన్ లేఖ రాయడం చిల్లరగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. టీటీడీ నిధులను ఈవో నిర్ణయాల ద్వారా దారిమళ్లిస్తున్నారనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి. ఇప్పుడు జగన్ అవ్యాజమైన ప్రేమ చూస్తోంటే ఆ అనుమానాలు కూడా నిజమే అనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.