మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి చిన్న గీత పెద్ద గీత సిద్ధాంతం తెలియనిది కాకపోవచ్చు. ఒక సమస్య ఉన్నదంటే అది మనల్ని తీవ్రంగా బాధ పెడుతున్నప్పుడు మనం దాన్ని అసహ్యించుకుంటూ ఉంటాం. ఆ ఆలోచనలోనే మగ్గిపోతూ ఉంటాం. అయితే హఠాత్తుగా అంతకంటే పెద్ద సమస్య వచ్చి మీద పడిందంటే మనం పాత సమస్యను మరిచిపోతాం. అంతవరకు తీవ్రంగా బాధించిన పాత సమస్య మనకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. చిన్నగీత పెద్దగీత సిద్ధాంతం అంటే ఇదే. ఇప్పుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో అదే జరుగుతోంది. ఎందుకంటే ఇన్నాళ్లు అయిన తనకు జీవితంలో ఉన్న అతిపెద్ద సమస్య ప్రతిపక్ష హోదా గల నాయకుడిగా గుర్తింపు పొందడం మాత్రమే. ఆ వేదన ఆయన అనుభవిస్తూ వచ్చారు. సందర్భం వస్తే చాలు.. ‘నాకు ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇవ్వడం లేదు మొర్రో’ అని చెప్పుకుంటూ వచ్చారు. దానితో కంపేర్ చేస్తే పెద్ద సమస్య మరొకటి ఇప్పుడు ముంచుకొచ్చింది. అసలు ఎమ్మెల్యే పదవి ఉంటుందో పోతుందో అనే చర్చ మొదలైన తరుణంలో ఆయనకు ప్రతిపక్ష హోదా అనేది చిన్న అంశం లాగా మారిపోయినట్లుంది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యుడిగా గెలిచిన నాటి నుంచి ఇవాళ్టి దాకా సుమారు 15 నెలలు కాలం గడిచిపోగా రెండే సార్లు శాసనసభలో అడుగు పెట్టారు. నేను శాసనసభకు వెళ్లను అని చెప్పడం ఏదో ఘనకార్యమైనట్లుగా ఆయన గత 15 నెలలుగా ప్రజలను బుకాయిస్తున్నారు. శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మొదటి సారి సభకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అప్పట్నుంచి డుమ్మా కొడుతూ గైర్హాజరీల పుణ్యమా అని ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోవాల్సి వస్తుందని అర్థం అయిన తర్వాత నామ్ కే వాస్తే అన్నట్లుగా ఒకసారి సభకు వచ్చి అటెండెన్స్ వేసుకొని పలాయనం చిత్తగించారు.
ఇప్పుడు మళ్లీ జగన్ మీద అనర్హత వేటు వేసే అంశం సర్వత్రా చర్చకు వస్తోంది. 60 రోజులపాటు నిరంతరాయంగా సభకు గైర్హాజరు అయితే గనుక అతని ఎమ్మెల్యే పదవి ఆటోమేటిగ్గా రద్దవుతుందని అతడి మీద అనర్హత వేటు వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చునని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. అయితే అలాంటి నిబంధనలే లేవంటూ జగన్ అనడం ఆయన పరువు తీసేలా ఉంది. రాజ్యాంగంలో సెక్షన్లతో సహా స్పీకరు, డిప్యూటీ స్పీకరు, గతంలో స్పీకరుగా పనిచేసిన యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నాయకులు అందరూ చెబుతున్నప్పటికీకూడా, ఆ నిబంధనలేవో చెప్పండి అంటూ జగన్ మాట్లాడడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అని ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి మాటలతో జగన్ తన పరువు తానే తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు.