చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని తూర్పారపట్టేయాలని, వీలైనంత ఎక్కువగా బురద చల్లి భ్రష్టు పట్టించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెగ కుతూహలంగా ఉన్నారనే సంగతి అందరికీ తెలుసు. చంద్రబాబు ప్రభుత్వం గద్దె ఎక్కిన తొలిరోజునుంచి కూడా ఆయన ప్రభుత్వాన్ని విమర్శించే పాటలే పాడుతున్నారు. ఒకవైపు.. ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం అంటూనే.. తొలి నెల నుంచి కూడా హామీలు నెరవేర్చలేదని, ప్రజలను వంచించారని అంటూ మొసలి కన్నీరు కార్చడం అనేది జగన్ కు మాత్రం చెల్లింది.
అయితే ఇప్పుడు సంక్రాంతి తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల తరఫున పోరాడుతానని అంటున్న జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఏం మాట్లాడాలో.. ఏం విమర్శలు చేయాలో తెలియని అయోమయస్థితిలో పడుతున్నారు. చంద్రబాబునాయుడు తాజాగా కేబినెట్ భేటీ అనంతరం చెబుతున్న మాటలు, ఎన్నికల హామీల అమలుకు ప్రకటిస్తున్న డెడ్ లైన్ల నేపథ్యంలో… జగన్ జిల్లాల యాత్ర చేసినప్పటికీ కూడా నోటికి తాళాలు వేసుకుని తిరగాల్సిందేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలో కొన్ని ఇంకా కార్యరూపంలోకి రాకపోవడం అనేది జగన్ మోహన్ రెడ్డి బ్రహ్మాస్త్రంగా ఎంచుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్డీయే కూటమికి అయిదేళ్లు పాలించే అవకాశం ఇచ్చారని, అయిదేళ్లలోగా అన్ని హామీలు నెరవేరడం గురించి ఎదురుచూస్తుంటారని జగన్ గ్రహించలేదు. రెండో నెలనుంచి సూపర్ సిక్స్ లో మిగిలిన వాటి గురించి యాగీ చేయడం ప్రారంభించారు. బహుశా.. సంక్రాంతి తర్వాత జిల్లాల యాత్రల ప్లాన్ లో కూడా ఆయన ప్రధాన ఎజెండా ఇదే అయి ఉంటుందనడంలో సందేహంలేదు.
కానీ రెండు మూడురోజులుగు సినేరియో మారిపోయింది.
తాజాగా కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు మాటలతో ఇంకా పరిస్థితులు మారిపోయాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హామీని ఉగాది నుంచి అమలు చేయబోతున్నట్టుగా చంద్రబాబునాయుడు ఆల్రెడీ ప్రకటించారు. కర్నాటకలో ఈ విధానం ఎలా అమలవుతున్నదో అధ్యయనం చేయడానికి మంత్రుల కమిటీ అక్కడ ప్రస్తుతం పర్యటిస్తున్నది కూడా. కాగా గురువారం నాడు మరో రెండు విషయాల్లో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. తల్లికి వందనం పేరుతో అమలు చేసే పథకాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి కార్యరూపంలోకి తేబోతున్నట్టు చెప్పారు. ఇక దాని గురించి మాట్లాడ్డానికి జగన్ కు వాయిస్ లేకుండాపోయినట్టే.
అలాగే రైతులకు పంటసాయం 20వేల రూపాయలు అందించే విషయంలో కూడా త్వరలోనే కేంద్రంతో మాట్లాడి క్లారిటీ ఇవ్వనున్నట్టుగా చంద్రబాబు మంత్రులతో అన్నారు. అన్ని హామీల గురించి రాష్ట్రప్రజలకు స్పష్టత వస్తున్న సమయంలో.. మళ్లీ వాటిగురించే జిల్లాల యాత్రల్లో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అభాసుపాలవడం గ్యారంటీ. అందుకే ఆయన యాత్రల్లో నోటికి తాళాలు వేసుకుని తిరగాల్సి వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.