ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే మాట మనం తరచూ వింటూఉంటాం. ఒకే పని చేయడం వల్ల రెండు ప్రయోజనాలు సాధిస్తే ఇలా అంటాం. కానీ.. ఒక పనిచేయడం వలన ఒక ప్రమాదం మరియు ఒక ప్రయోజనం ఉంటే దాన్ని ఎలా అనాలో తెలియదు. అలాంటప్పుడు ఎలాంటి ఫలితం దక్కుతుందో క్లారిటీ లేనప్పుడు ఆ పనిచేయాలో లేదో అనే సందిగ్ధంలో పడిపోతాం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి సంకట స్థితిలోనే ఉన్నారు. ఆస్తుల వివాదం ఇంత తారస్థాయికి చేరుకున్న తర్వాత.. ఒక మాట చెబితే ఆయన కాస్త సేఫ్ జోన్ లో ఉంటారని ఆత్మీయులు కొందరు సలహా ఇస్తున్నారు. కానీ.. అందులోనే ఒక ప్రమాదం కూడా ఉన్నదని జగన్ సందేహిస్తున్నట్టుగా, అందుకే సంకోచిస్తున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వైఎస్ విజయమ్మ చెబుతన్న ప్రకారం.. తన భర్త వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉండగా ఏర్పడిన ఆస్తులన్నీ కూడా తమ మొత్తం కుటుంబానికి చెందిన ఆస్తులు అని ఆమె అంటున్నారు. ఆస్తులన్నింటినీ వైఎస్సార్ పిల్లల్లో ఒక్కొక్కటీ ఒక్కొక్కరి పేరుమీద పెడుతూ వచ్చారని, అంతే తప్ప అవి వారికి పంచినట్టుగా కాదని ఆమె చెబుతున్నారు. నిజానికి ఈ మాటలో లాజిక్ లేదు. లాజిక్ లేని మాట గురించి జగన్మోహన్ రెడ్డి జడుసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఒక మాట చెబితే ఆయన చాలా సేఫ్ పొజిషన్ లో ఉంటారు. ఆ మాట ఏంటంటే..
‘‘నా ఆస్తులకు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు’’ అంటే సరిపోతుంది. ఆయన ఇప్పటికే అలాంటి అర్థం వచ్చేలా అనేక మాటలు చెబుతున్నారు.. ఇంత సూటిగా చెప్పలేకపోతున్నారు. జగన్ తన స్వార్జితమైన ఆస్తులలో ప్రేమకొద్దీ రష్మిలకు వాటాలు పంచి ఇవ్వాలని అనుకున్నారని.. ఆమె ప్రేమ ఆప్యాయతలను కొనసాగించలేదని అంటున్నారు. అందుకే ఆయన షేర్లు వెనక్కు అడుగుతున్నారు. కానీ సూటిగా స్పష్టంగా.. వైఎస్సార్ కు ఆస్తులతో సంబంధం లేదు.. అనేస్తే ఆయన కొంతలో కొంత సేఫ్ జోన్ లోకి వెళ్లగలరు. తండ్రి బతికి ఉండగా కొడుకు/ పిల్లలు సొంత ఆస్తులు ఏర్పాటు చేసుకోవడం చాలా సహజమైన విషయం. కానీ ఆ మాట అనడంలో జగన్ కు ఒక డేంజర్ కూడా ఉంది.
సూచన ప్రాయంగా అనగలరు తప్ప.. తన ఎదుగుదల, ‘తన ఆస్తుల వెనుక రాజశేఖర రెడ్డి పాత్ర లేదు’ అని చెప్పడానికి జగన్ కు ధైర్యం లేదు. కేవలం వైఎస్సార్ కొడుకు అనే పాయింట్ ను మార్కెట్ చేసుకోవడం ద్వారా మాత్రమే ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అలాంటిది ఇవాళ వైఎస్ ను అతిక్రమించినట్టుగా, చులకన చేసినట్టుగా మాట్లాడితే.. ఆయనను అభిమానించే లక్షలాది మంది ప్రజలు జగన్ ను అసహ్యించుకుంటారు. అసలే అవినీతి కేసుల చార్జిషీట్ లోకి జగన్ కావాలని తండ్రి పేరును కూడా ఇరికించేలా కుట్ర చేశారని షర్మిల ఒక ప్రచారం సాగిస్తున్నారు. దానికి తోడు జగన్ ఇలాంటి ప్రకటన చేస్తే మరింతగా భ్రష్టుపట్టిపోయే ప్రమాదం ఉన్నదని భయపడుతున్నారు.
నా ఆస్తులకు రాజశేఖర రెడ్డికి సంబంధం లేదు- అని చెప్పలేక, చెబితే తప్ప పరిస్థితుల నుంచి తప్పించుకోలేక జగన్ చాలా సంకట స్థితిలో ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు.