ఎన్నికల సమయంలో ఏదో ఒకమతానికి సంబంధించి ఏదైనా పండగ వచ్చిందంటే.. నాయకులు మాత్రం నిజంగానే పండగ చేసుకుంటారు. ఆ పండుగ సందర్భాన్ని తమ తమ పొలిటికల్ ఎడ్వాంటేజీగా మార్చుకోవడానికి గరిష్టంగా వాడుకుంటారు. అంతే తప్ప పర్వదినం రోజున ఐసొలేషన్ లో గడపరు. ప్రజలకు దూరంగా ఒంటరిగా ఉండాలని అనుకోరు. కానీ ఒక మతాన్ని మొత్తం ఇంప్రెస్ చేయగల అవకాశం రంజాన్ పండగ రూపంలో వస్తే.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ అవకాశాన్ని వాడుకోకుండా విశ్రాంతి పేరుతో తనను తాను ఐసొలేషన్ లో బంధించేసుకున్నారు. పండగపూట ఇలా ఒంటరిగా, ఒకరిద్దరిని మాత్రమే కలుస్తూ గడపడం అనేది.. జగన్ లో వ్యక్తమౌతున్న నైరాశ్యభావనలకు చిహ్నం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రంజాన్ పర్వదినం నాడు ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజెప్పడంతో చేతులు దులుపుకున్నారు తప్ప.. ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొనడం, వారితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి ఏ పనీచేయలేదు.
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ల వద్ద బుధవారం రాత్రి విడిది కేంద్రానికి చేరుకున్నారు. అదే రాత్రి సీఎం భార్య భారతీరెడ్డి అక్కడకు వచ్చారు. గురువారం రంజాన్ కారణంగా బస్సు యాత్రకు విరామం అని ముందే ప్రకటించారు. గురువారం ఉదయం సత్తెనపల్లి అభ్యర్థి అంబటి రాంబాబు, గుంటూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ శిబిరంలోకి వెళ్లి అరగంటసేపు జగన్ తో గడిపి వచ్చారు. గురువారం జగన్ పూర్తిగా విశ్రాంతిలో ఉంటారని ఎవరినీ కలవరని నాయకులు ముందే ప్రకటించారు. దాంతో ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఎవ్వరూ శిబిరం వద్దకు కూడా రాలేదు. శుభాకాంక్షలు తెలియజేయడానికి కొందరు ముస్లిం కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని శిబిరం వద్దకు రాబోతే.. పోలీసులు అనుమతి లేదని వారిని తిప్పి పంపేశారు. రోజంతా విశ్రాంతి పేరుతో ఎవరినీ కలవకుండానే గడిపారు.
సాధారణంగా.. రంజాన్ వంటి పర్వదినం వచ్చినప్పుడు ముస్లింలతో కలిసి ఆ సమయాన్ని గడిపి, ఆ ఫోటోలతో ఆ వర్గంలో మైలేజీ పొందడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. సహజం కూడా. జగన్ అలాంటి పనేమీ చేయలేదంటే.. ఆయనలో నైరాశ్యం తాండవిస్తున్నదని పలువురు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల కిందట ఉగాది పర్వదినం నాడు నామమాత్రంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఉగాది పంచాగ శ్రవణం రద్దుచేశారు. ఇదంతా కూడా ఆయనలోని ఓటమి భయం కారణంగా పుట్టిన డిప్రెషన్ ఎఫెక్టే అని పలువురు అంటున్నారు.