వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఈ సారి ఎన్నికలను చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారు. ఏ జ్యోతిష్యుడు.. ఏ స్వామీజీ ఆయనకు చెప్పారో గానీ.. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ ముఖ్యమంత్రి అయితే చాలు.. ఇక ఏకంగా ముప్పయ్యేళ్ల పాటు అప్రతిహతంగా ఆ కుర్చీలోనే ఉండిపోతానని బలమైన నమ్మకంతో ఉన్నారు జగన్. కానీ ఈ ఎన్నికల గండాన్ని దాటడమే చాలా కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఆయన రాబోయే ఎన్నికలకు తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో ద్వారా.. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో ప్రజల్లో ఉన్న చాలా సందేహాలకు జగన్ స్పష్టమైన సమాధానాలు ఇవ్వకపోయినా, సంకేతాలు ఇచ్చారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. ఈరాష్ట్ర పరిపాలన నాకు చేతకాదు.. నిధులు తీసుకురావడం నాకు కుదరదు. ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో అది మాత్రమే చేస్తూ ఉంటాను మీకు ఇష్టమైతే ఓట్లు వేయండి.. లేకపోతే మానేయండి అని తెలియజేస్తున్నట్టుగా ఉంది. రెండు విషయాలలో తప్ప, సంక్షేమ పథకాలలో ఎలాంటి మార్పు చేర్పులు ఉన్నతీకరణ లేకపోవడం గమనిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలతో పోటీ పడడం కాదు కదా.. అసలు వాటి జోలికి కూడా వెళ్లకుండా.. ఎలాంటి కొత్త పథకాన్ని కూడా ప్రజలకోసం ప్రకటించకుండా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చేతులెత్తేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఒక ప్రభుత్వం పాలన సాగిస్తూ ఉన్నదంటే- రెండోసారి అధికారంలోకి వస్తే ఇప్పుడు చేస్తున్న దాని కంటే కొత్తగా, మెరుగ్గా, ఎక్కువగా ఏదైనా చేయాలని తపన పడుతుంది. ఇప్పుడు చేస్తున్నదే చాలా ఎక్కువ.. ఇక చేయాల్సింది కొత్తగా ఏమీ లేదు అని అహంకారపూరితంగా వ్యవహరించే రాజకీయ పార్టీ మనకు ఎక్కడా కనిపించదు.
ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ తప్ప! ఆరు పేజీల మేనిఫెస్టోను జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తే అందులో రైతులకు ఏటా అందించే సాయం కొంత పెంచడం, పెన్షనర్లకు మొత్తం ఐదేళ్లకు కలిపి కేవలం రూ.500 పెంచడం తప్ప మరొక గొప్ప హామీ లేదు. ఆ మేనిఫెస్టో మొత్తానికి ఇవే అతి గొప్ప హామీలు. అంటే మిగిలిన హామీలు ఎంత దిగజారుడుతనంగా ఉన్నాయో ప్రజలే అర్థం చేసుకోవచ్చు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా అదే వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అయ్యాయని ఇప్పుడు సంపద సృష్టించడం చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశారని అంటున్నారు.
జగన్ తన మేనిఫెస్టో ద్వారా ఆ విషయాన్ని నిరూపించారు. సంపద సృష్టి అనేది తనకు చేతకాని విద్య అని ఆయన చాటుకున్నారు. పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానించడం స్థలాలను కేటాయించి ఆ పరిశ్రమలు మొదలయ్యేలా చూడడం స్థానికంగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడే పరిస్థితిని సృష్టించడం ఎప్పుడూ కూడా రాష్ట్రానికి సంపదని సృష్టిస్తాయి. అయితే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను కూడా వెళ్లగొట్టడం తన ఐదేళ్ల పాలన ఎజెండాగా మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏ పరిశ్రమలు తీసుకు వస్తారనేది ప్రజల సందేహం. నిజానికి పరిశ్రమలను తీసుకురాగలను రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచగలననే నమ్మకం ఆయనకు కూడా ఉన్నట్టు లేదు. అందుకే అలాంటి ప్రస్తావనలు జోలికి వెళ్లకుండా ఒక మొక్కుబడి మానిఫెస్టో ప్రకటించి వచ్చారని ప్రజలు అంటున్నారు.