జగన్ పొట్టకొడితే.. చంద్రబాబు వెన్ను తట్టారు!!

జగన్మోహన్ రెడ్డి కి తన పరిపాలన కాలంలో.. తన పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు తప్ప మరెవ్వరూ మనుషులుగా కనిపించలేదు. ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగులు అంటే వారు తనకు ఆగర్భశత్రువుల్లాగా ఆయన పరిగణించారు. ఉద్యోగుల అంశాల విషయంలో ప్రతి సారీ వారి పొట్టకొట్టే నిర్ణయాలు తీసుకున్నారు. వారిలో భయంకరమైన వ్యతిరకతను మూటగట్టుకున్నారు. ఆ రకంగా ఆయన ఉద్యోగుల పొట్టకొడుతూ పోగా.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు వారి వెన్నుతట్టి, వారికి అండగా తాను ఉంటాననే భరోసా కల్పిస్తున్నారు.
ఇక్కడ ఇంకో గొప్ప ట్విస్టు ఏంటంటే.. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా.. జగన్ ప్రభుత్వ నిర్ణయాలు జీవోలుగా రావడం, గెజిట్ విడుదల కావడం. జగన్ భక్త ఉన్నతాధికారులు.. తాము పదవులనుంచి పలాయనం చిత్తగించేముందు.. చివరిసారిగా జగన్ భక్తిని ప్రదర్శించుకోవడానికి వివాదాస్పద నిర్ణయాలకు కూడా గెజిట్ విడుదల చేసేసి వెళ్లిపోయారు. కాగా సదరు జీవోను ఆపుచేసి చంద్రబాబు ఉద్యోగులకు ఊరట కల్పిస్తున్నారు.

ఇదంతా కూడా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కు సంబంధించిన వివాదం. జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ ను రద్దుచేసి.. పాత పెన్షన్ విధానం తీసుకువస్తానని ఉద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చారు. గద్దెఎక్కిన తర్వాత వారిని పట్టించుకోలేదు. వారెన్ని ఆందోళనలు చేసినా ఉక్కుపాదంతో అణచివేశారు. ఉద్యోగుల ఆందోళనలను తాను చెప్పినంత ఘోరంగా అణచివేయడంలో విఫలమైనందుకు.. ఒక డీజీపీని కూడా మార్చేశారు.

అలాంటి జగన్.. ఉద్యోగులందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కూడా పట్టించుకోకుండా జీపీఎస్ తీసుకువచ్చారు. అయితే దానికి సంబంధించిచ జీవో మాత్రం రాలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. అప్పటికి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జగన్ భక్త అధికారి రావత్.. దానికి ఆమోదం చెప్పేసి సెలవు పెట్టేశారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన రోజునే.. జూన్ 12 జీవో వచ్చింది. జులై 12న గెజిట్ కూడా వచ్చింది. గత ప్రభుత్వ నిర్ణయాలను ఇప్పుడు గెజిట్ గా ఇవ్వడంపై చంద్రబాబు మండి పడి.. దానిని నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. తమ జీవితాలతో ఆడుకునే జీపీఎస్ ను ఆపేసినందుకు ఇప్పుడు ఉద్యోగులంతా చంద్రబాబుకు ధన్యవాదాలు చెబుతున్నారు. చంద్రబాబునాయుడు సీపీఎస్ ఉద్యోగులకు మరొక మెరుగైన విధానం తీసుకువచ్చే దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. 

Related Posts

Comments

spot_img

Recent Stories