కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి అన్యాయం జరిగిందనేది జగన్ గోల! పోలింగ్ పారదర్శకంగా, నిజాయితీగా జరగలేదని తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను కూడా లోపలికి రానివ్వకుండా అడ్డుకుని ఓట్లు అన్ని తెలుగుదేశం వాళ్లే వేసుకున్నారని ఆయన పదేపదే ఆరోపిస్తున్నారు. అయితే ఓడిపోయే అంచుకు చేరిన ప్రతి నాయకుడు కూడా, పోలింగ్ జరిగిన తీరుతెన్నుల మీద సందేహాలు లేవనెత్తడం, ప్రజలు తమను ఛీత్కరిస్తున్నారనే వాస్తవాన్ని గుర్తించకుండా ఎన్నికల ప్రక్రియ మీద నిందలు వేసి పబ్బం గడుపుకోవడం మన రాజకీయ వ్యవస్థలో కొత్త విషయం కానే కాదు. జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి అన్యాయం జరిగిందని నిజంగా భావిస్తుంటే గనుక న్యాయపోరాటం ద్వారా నెగ్గే అవకాశం ఉంది. కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది. అయితే ఆ మార్గాలను ఆయన ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం మీడియా ముందు రభస చేయడం, ప్రభుత్వం మీద, ఎన్నికల సంఘం మీద నిందలు వేయడం చాలు. ప్రజలను మాయ చేసి రాష్ట్రంలో ఘోరాలు జరుగుతున్నట్లుగా భయపెట్టి మభ్య పెడితే చాలు.. అనే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఈ రెండు జెడ్పిటిసి స్థానాలకు రీపోలింగ్ జరగాలని.. నూటికి నూరు శాతం కేంద్ర బలగాల భద్రత ఏర్పాట్ల మధ్యనే ఈ రీపోలింగ్ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితిని తొలిసారి కల్పించిన పారదర్శక వాతావరణంలో జరిగిన ఎన్నికలను ఆయన సహించలేకపోతున్నారు. వీటిని పూర్తిగా రద్దు చేసి మళ్లీ ఎన్నికలు పెట్టాలని అంటున్నారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, ఆ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలను వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఎన్నికల సంఘానికి ఉందా అని జగన్ ప్రశ్నిస్తున్నారు.
అయితే అక్రమాలు జరిగాయనే విషయంలో తన సందేహాలు నివృత్తి అయ్యేలా ఈ కోరికను తీర్చుకోవడానికి జగన్ న్యాయపరమైన మార్గాలను అన్వేషించడానికి అవకాశం ఉంది. ఆయన వెబ్ కాస్టింగ్, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించే అధికారం కావాలని హైకోర్టును ఆశ్రయించవచ్చు. అయితే ఎన్నికల సంఘం నిబంధనలను మీరి ఆ ఫుటేజీలు తమ పార్టీ వారికి ఇవ్వాలి- అనే డిమాండ్ చెల్లుబాటు అయ్యేది కాదు. అయితే ఒక న్యాయమూర్తి ద్వారా లేదా మాజీ న్యాయమూర్తి ద్వారా న్యాయ విచారణ జరగాలని కోరవచ్చు. అలా పార్టీ ప్రతినిధుల సమక్షంలో న్యాయమూర్తి వెబ్ కాస్టింగ్ ఫుటేజీని, సీసీటీవీ ఫుటేజీని స్వయంగా పరిశీలించి దొంగ ఓట్లు పడ్డాయో లేదో నిర్ధారించాలని కూడా ఆయన డిమాండ్ చేయవచ్చు. కానీ అలాంటి మార్గాల గురించి జగన్ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అదే జరిగితే ఆయన ఆరోపణలలోని డొల్లతనం బయటపడిపోతుంది. జగన్ పసలేని ఆరోపణలు చేస్తున్నట్టుగా అందరికీ అర్థమవుతుంది. తన పరువు పోతుందనే భయంతో న్యాయపరమైన మార్గాలను అన్వేషించకుండా, కేవలం మీడియా కెమెరాలు ముందు కూర్చుని జగన్ ఓవరాక్షన్ చేస్తున్నారు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.