తన అభ్యర్థుల గురించి జగన్ కు తెలిసిందే రెండే!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ అంటూ సాగిస్తున్న ఎన్నికల ప్రచార సభలను గమనించారా? ఏ సభలోనైనా ఆయన ప్రసంగాన్ని పూర్తిగా చూశారా? అందులో చాలా చిత్రాలు ఉంటాయి.

సాధారణంగా జగన్ ప్రసంగంలో 75 శాతం వరకు చంద్రబాబునాయుడును, పవన్ కల్యాణ్, కూటమిని పురందేశ్వరిని తిట్టడానికి కేటాయిస్తారు. ఆ 75 శాతంలోనూ తెలుగుదేశం 2014 నాటి మేనిఫెస్టో బ్రోషర్ లాకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్టుగా.. వాటిని ఒకచేత్తో పైకెత్తి చూపుతూ.. ఆ హామీలను నిలుపుకోలేదని విమర్శించడంతో గడచిపోతుంది. 75 పోగా మిగిలిన దానిలో 23 శాతం తన గురించి చెప్పుకుంటారు. తాను ఏమేం చేసేశానో చెబతారు. ఇక పోగా, రెండుశాతం సమయాన్ని మాత్రం.. మీటింగు వేదిక పరిసారల్లోని నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులందరినీ సభలో పరిచయం చేసి వారికి ఓటు వేయాలని కోరుతారు. అప్పటిదాకా వారంతా వేదికమీద వెనగ్గా నిల్చుని ఉంటారు. ప్రసంగం ముగించే ముందు ఒక్కొక్కరినీ తన పక్కకు పిలిచి, ఒక్కొక్కరి గురించి 20-30 సెకండ్లు ప్రజలకు చెబుతారు. ఇంతా కలిపి.. ప్రతి అభ్యర్థి గురించి కూడ ప్రజలకు జగన్ చెప్పే మాటలు రెండే రెండు.. ‘మంచివాడు.. సౌమ్యుడు’! రాష్ట్రంలోని 175 మంది అభ్యర్థులకు కూడా ఈ రెండు లక్షణాలు తప్ప మరో లక్షణం లేదా, లేదా మరో లక్షణం జగన్ కు తెలియదా? అని జనం విస్తుపోతుంటారు.

జగన్ ప్రతి సభలోనూ.. అభ్యర్థిని తన వద్దకు పిలిచి.. ‘అన్న మంచి వాడు సౌమ్యుడు. తప్పకుండా గెలిపించండి’ అనే మాట చెబుతారు. మహా అయితే కొందరు నాయకుల గురించి ఇంకో మాట ఉంటుంది. ‘నాకు చాలా ఆత్మీయుడు’ అనేది! అలాగే.. కొందరి గురించి చెప్పడానికి మరొక మాట కూడా ఉంటుంది.. ‘మీలో ఒకడు’ అని! అంటే పేద వారు అని జగన్ ముద్రవేసిన వారినందరినీ మీలో ఒకడు అని జగన్ అంటూ ఉంటారు. తద్వారా, మిగిలిన అభ్యర్థులంతా.. జనానికి దూరంగా మెలిగేవాళ్లు అనే అర్థం వస్తుందని ఆయనకు తెలుసో లేదో మరి.

అలాగే ఏ ఒక్క అభ్యర్థి గురించి కూడా.. మంచి వాడు, సౌమ్యుడు అనే పదాలు తప్ప.. ఆ పర్టిక్యులర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడానికి ఆయన ఏ రకంగా అర్హుడో జగన్ ఒక్క మాట కూడా చెప్పరు. ఓట్లు వేసే వాళ్లు తనని చూసి, తన పథకాల్ని, తాను పంచే డబ్బులను చూసి ఓటు వేయాలే తప్ప.. అభ్యర్థుల వ్యక్తిగత అర్హతలను చూసి ఓటు వేయాల్సిన అవసరం లేదు అనేది జగన్ అహంకారపూరిత ధోరణి అని పలువురు విశ్లేషిస్తున్నారు. అందుకే అభ్యర్థులకు సొంతంగా అర్హతలు ఉండాలని కూడా ఆయన అనుకోవడం లేదనే విమర్శలు కూడా వినవస్తున్నాయి. టికెట్ ఇచ్చేప్పుడు ధనబలాన్ని మాత్రమే ప్రాతిపదికగా చూస్తున్నారని, నియోజకవర్గంతో ఉండే అనుబంధం, చేయగల సేవాభిలాష గురించి.. జగన్ మాట మాత్రంగా కూడా పట్టించుకోవడం లేదని, ప్రజలకు కూడా చెప్పడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తునన్నారు. అసలు జగన్ చేసే పరిచయం అభ్యర్థులకు అవమానకరంగా కూడా ఉంటోందని కొందరు అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories