హుకుం.. జగన్ కా హుకుం జారీ అయింది. భారతీయ జనతా పార్టీకి చెందిన అందరు కీలక నాయకులకు జగన్మోహన్ రెడ్డి తరఫున ఆదేశాలు అందాయి. నాయకుల ద్వారా కింది స్థాయి కార్యకర్తల వరకు ఆ ఆదేశాలను తక్షణం చేరవేయాలని సూచిస్తున్నారు. ఇంతకూ ఆ ఆదేశాలు ఏమిటా అనుకుంటున్నారు కదా. చిలకలూరిపేటలో జరగబోతున్న ప్రజాగళ: సభలో ప్రధాని నరేంద్రమోడీ ఏం మాట్లాడినా సరే.. పార్టీ తరఫున ఏ ఒక్కరూ కూడా ఎలాంటి కౌంటర్ ప్రకటనలు చేయనేవద్దని హుకుం జారీ అయింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని నరేంద్రమోడీతో తొలినుంచి కూడా చాలా మంచి సత్సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన తన తండ్రి వంటి వారు అని.. బహిరంగ వేదికల మీద ప్రకటించారు కూడా. వ్యక్తిగతంగా వెళ్లి కలిసినప్పుడైనా, వేదికల మీదనైనా, చివరికి ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికే సందర్భాల్లోనైనా కూడా.. మోడీ కనపడగానే.. ఆయన పాదాలను స్పృశించి ఆశీస్సులు కోరుకునే అతిభక్తిని జగన్ తొలినుంచి చూపిస్తున్నారు. అయితే.. ఇదంతా కూడా తన మీద ఉన్న కేసుల విషయంలో కేంద్రం ఉదాసీన వైఖరితో ఉండాలనే కోరికతో, దర్యాప్తు సంస్థలు చురుగ్గా వ్యవహరించకుండా కాపు కాయాలనే లక్ష్యంగా మోడీ పట్ల చూపిస్తున్న కుటిలభక్తి మాత్రమేననే విమర్శలు అనేకం ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం- జనసేన పార్టీలో కేంద్రంలోని బిజెపితో కూడా పొత్తు పెట్టుకోవాలని ప్లాన్ చేసినప్పటినుంచి జగన్మోహన్ రెడ్డిలో గుబులు ప్రారంభం అయింది. 2014 నాటి విన్నింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని మాత్రమే కాదు. మోడీ కూడా తనకు ప్రత్యర్థిగా తయారైతే.. తన మీద ఉన్న కేసుల్ని తిరగతోడుతారేమో అనేది కూడా ప్రధాన భయంగా సాగింది. ఆ పొత్తులు కుదరకుండా చూడడానికి జగన్ తనవంతు ప్రయత్నం చేశారు. ఓసారి ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసి వచ్చారు కూడా. కానీ ఆయన అనుకున్నట్టు జరగలేదు. పొత్తులు కుదిరాయి.. ఆ ముగ్గురూ కలిసే ఇప్పుడు జగన్ మీద దండయాత్ర చేయబోతున్నారు.
అయితే, సభలో నాయకులు విమర్శలు చేయగానే.. ఆ నాయకుల గురించి అత్యంత అసహ్యకరమైన రీతిలో ప్రతివిమర్శలు చేయడం వైసీపీ వారికి అలవాటు. ప్రజాగళం సభ ముగిసిన వెంటనే.. తన పార్టీ వారు కౌంటర్లు మొదలెడతారనే భయంతో జగన్ ముందే హెచ్చరికలు పంపినట్టుగా తెలుస్తోంది.
కావాలంటే.. తెలుగదేశం, జనసేన పార్టీలను ఎంతగానైనా ఉతికి ఆరేయవచ్చు గానీ, మోడీ జోలికి మాత్రం వెళ్లొద్దని సూచించారుట. కావాలిస్తే ఏపీ బీజేపీ నాయకుల్ని విమర్శించిన పర్లేదని సూచిస్తున్నారట. తన మీద ఉన్న అవినీతి కేసుల గురిచం జగన్ మరీ ఇంతగా భయపడుతున్నారా? కనీసం ఎన్నికల సమయంలో కూడా మోడీని పల్లెత్తు మాట తన పార్టీలో ఎవ్వరూ అనడానికి కూడా జంకుతున్నారా? అని ప్రజలు విస్తుపోతున్నారు.