డీలిమిటైజేషన్ అనే వ్యవహారం ఇప్పుడు దేశం మొత్తాన్ని కుదుపుతోంది. రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి శత్రుపక్షాలన్నీ కూడా డీలిమిటైజేషన్‌పై ఏకం అయ్యే ప్రయత్నాలలో ఉన్నాయి. ప్రధానంగా ఈ ప్రక్రియ వలన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని గట్టిగా వాదిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పార్టీలన్నింటినీ ఏకం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. డి లిమిటైజేషన్ వ్యతిరేక స్వరం వినిపించడానికి భాజపాయేతర ప్రభుత్వాలు ఉన్న అనేక రాష్ట్రాలకు, భాజపాయేతర పార్టీల అధినేతలకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపి మరి ఆయన చెన్నైలో ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా నష్టపోతున్నది దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే కాగా. ఈ అన్ని రాష్ట్రాల ప్రతినిధులలోనూ డీలిమిటేషన్ పై తమ స్పష్ట వైఖరి తెలియజేయకుండా నాటకాలు ఆడుతున్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ఈ భేటీతో తేటతెల్లం అవుతోంది.
చెన్నైలో జరిగిన సమావేశానికి సహజంగానే వైయస్ జగన్ కు కూడా ప్రత్యేక దూత ద్వారా ఆహ్వానం పంపారు స్టాలిన్. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, భాజపాయేతర పార్టీలకు కూడా ఆహ్వానాలు అందాయి. నిజానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఆహ్వానించారు. కానీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పార్టీ అధినేతగా చంద్రబాబు ఆ కార్యక్రమానికి హాజరు కావడం అనేది జరిగేపని కాదు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి తరఫున కల్వకుంట్ల తారక రామారావు, కర్ణాటక నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేరళ నుంచి ప్రభుత్వంలోని వామపక్ష నేతలు ఇలా కీలక నాయకులు అందరూ కూడా ఈ అఖిలపక్ష సమావేశానికి వచ్చారు.
గైర్హాజరు అయిన ప్రముఖుడు ఏపీలో ఎన్డీఏకు ప్రతిపక్షంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రమే. శాసనసభకు వెళ్లడానికి రకరకాల సాకులు వెతుక్కునే జగన్, అఖిలపక్ష సమావేశానికి కూడా డుమ్మా కొట్టి ప్రధానికి లేఖ రాస్తా అనే నంగనాచి, బుకాయింపు మాటలు చెబుతున్నారు.
‘కేంద్రంలోని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీలకు ఆగ్రహం కలిగించే ఏ నిర్ణయం తీసుకోవడానికి అయినా జగన్మోహన్ రెడ్డికి ధైర్యం లేదు’ అనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బిజెపి నేతలు జగన్మోహన్ రెడ్డిని ఎంతగా విమర్శించినా సరే వారికి ఆయన ప్రతి విమర్శలు ఉండవు. ఆయన ఆడిపోసుకునేదంతా తెలుగుదేశం, జనసేన పార్టీలను మాత్రమే. బిజెపిని పల్లెత్తు మాట అనరు! అలాగే డీలిమిటేజైషన్ కు వ్యతిరేకంగా డీఎంకే నిర్వహించే సమావేశానికి వెళితే మోడీ ఆగ్రహిస్తారని జగన్ వణుకుతున్నట్లుగా ఉంది. కానీ వెళ్ళకపోవడం వలన బిజెపితో సత్సంబంధాల కోసం ఆరాటపడుతున్నారనే విమర్శ రాకుండా ఉండేందుకు.. ‘నేను ప్రధానికి లేఖ రాస్తా’ అనే మాయ మాటలు చెబుతున్నారు. రాజకీయంగా ఒక నిర్దిష్టమైన వైఖరి తీసుకోకుండా మొత్తం దక్షిణాదిలో నాటకాలు ఆడుతున్న ఏకైక నేతగా జగన్మోహన్ రెడ్డి ముద్ర పడుతున్నారు.